
పత్తికి ప్రతికూలమే
యూరియా కోసం అగచాట్లు..
● భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి చేలు ● తేమ పెరిగి ఎర్రబారిన మొక్కలు ● రాలిపోతున్న పూత, పిందె, కాయలు ● దిగుబడిపై రైతుల్లో భయాందోళన
బూర్గంపాడు: ఆగస్టు రెండో వారం వరకు ఆశాజనకంగా ఉన్న పత్తిచేలు, ఆ తర్వాత కురుస్తున్న భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. అధిక వర్షాలతో చేలలో నీరు నిలిచి తేమ పెరగడంతో మొక్కలు ఎర్రబారుతున్నాయి. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పూత, పిందె రాలిపోతున్నాయి. కొన్నిచోట్ల కాయ దశకు రాగా అవి నల్లబడి కుళ్లిపోతున్నాయి. దీనికి తోడు ఎడతెరిపిలేని వర్షాలతో చేలలో కలుపు పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది దిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు భయాందోళన చెందుతున్నారు.
నిలిచిన ఎదుగుదల..
జిల్లాలో ఈ ఏడాది 2.15 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జూన్‌లో పత్తి గింజలు వేయగా, జూన్, జూలైలో కురిసిన సాధారణ వర్షాలతో పంట ఏపుగా పెరిగింది. ఆగస్టు రెండో వారం వరకు పత్తి చేలు పూత, పిందె, కాయలతో కళకళలాడాయి. ఆ తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో క్రమంగా దెబ్బతింటూ వస్తున్నాయి. గత 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పంటను మరింతగా కుంగదీశాయి. దసరా నాటికి పత్తి చేతికందుతుందని రైతులు ఆశించగా.. ఇటీవలి భారీ వర్షాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటికే రెండు విడతల ఎరువులు వేయడంతో పాటు మూడుసార్లు పై మందులు(దోమ, పురుగు, తెగుళ్ల మందులు) పిచికారీ చేశారు. అయితే వర్షాల కారణంగా పత్తిచేలలో ఎదుగుదల నిలిచిపోయింది. అధిక వర్షాలతో దోమ, పురుగు ఉధృతి పెరుగుతోంది. తేమశాతం ఎక్కువగా ఉండగా బూజు తెగుళ్లు, చీడపీడలు అధికమవుతున్నాయి. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు వానలు అడ్డంకిగా మారాయి. మందులు పిచికారీ చేస్తే వర్షానికి పనిచేయదని, మందులు, కూలీలు ఖర్చు వృథా ఆవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మొక్కకు 10 నుంచి 20 కాయల వరకు వర్షాలతో దెబ్బతిన్నాయని చెబుతున్నారు. దీంతో ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్ల మేర నష్టం తప్పదని అంటున్నారు.
జిల్లాలో నల్లరేగడి, లోతట్టు ప్రాంతాల్లోని పత్తి చేలే అధిక వర్షాలతో ఎక్కువగా దెబ్బతింటున్నాయి. అయితే ఎర్రరేగడి, ఇసుక, బెట్ట ప్రాంతాల్లో మాత్రం అంతగా నష్టం వాటిల్లడం లేదు. అయితే ఆ చేలలో కూడా పూత, పిందె, కాయలు కొంతమేర రాలిపోతున్నా మొక్కలు మాత్రం ఎర్రబారలేదు. పంట దెబ్బతిన్న ఈ తరుణంలో యూరియా వినియోగించాల్సి ఉండగా కొరత కారణంగా అందుబాటులో లేదు. దీంతో రైతులు వ్యవసాయ పనులు మానుకుని యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు. కొందరు రైతులు నానో యూరియా పిచికారీ చేస్తున్నారు. ఇక భారీగా కలుపు పెరుగుతుండగా తీసేందుకు వర్షాల ప్రభావంతో కూలీలు రావడం లేదు. ఇప్పటికే రూ.వేలు పెట్టుబడి పెట్టగా కనీసం ఆ డబ్బయినా తిరిగివస్తుందా లేదా అని రైతులు భయపడుతున్నారు.