
అలుపెరుగని ఆటసారి..
వయస్సు అడ్డురాలేదు..
‘బైపాస్’భయపెట్టలేదు..
73 ఏళ్ల వయసులో
నాలుగు బంగారు పతకాలు
పవర్ లిఫ్టింగ్‌లో వెటరన్
క్రీడాకారుడి ప్రతిభ
బైపాస్ సర్జరీ అయి బంగారు పతకాలు సాధించిన ఏకై క వ్యక్తిగా రికార్డ్
తపన చూసి శిక్షణ ఇచ్చాం..
అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనాలని..
భద్రాచలంటౌన్: కృషి ఉంటే మనుషులు ఋషుళవుతారు.. మహాపురుషులవుతారు.. అని ఒక సినీ కవి అన్నట్టుగానే సాధించాలనే తపన ముందు లక్ష్యం చిన్నదైపోతుందని నిరూపించాడు భద్రాచలం పట్టణానికి చెందిన బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి డీవీ శంకర్‌రావు. 73 ఏళ్ల వయస్సు.. బైపాస్ సర్జరీ అయినా జీవితంలో ఏదైనా సాధించాలనే ఆకాంక్షతో బెంచ్ ప్రెస్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయిలో ఒకేసారి నాలుగు బంగారు పతకాలు సాధించి అందరి మన్ననలు పొందాడు. భారత్‌లో బైపాస్ సర్జరీ చేసుకుని బెంచ్ ప్రెస్ 83 కిలోల విభాంగంలో నాలుగు బంగారు పతకాలు సాధించిన ఏకై క వ్యక్తిగా రికార్డ్ సాధించాడు. డీవీ శంకర్‌రావు 73 ఏళ్ల వయసులో జాతీయస్థాయి రికార్డు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆరు నెలల కృషితో..
ఎస్‌బీఐ ఉద్యోగిగా విరమణ పొందిన డీవీ శంకర్‌రావు రోజూ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకింక్ చేసేవారు. తోటి మిత్రుడు శోభన్‌నాయక్ సలహాతో పవర్ లిఫ్లింగ్‌లో కోచింగ్ కోసం స్థానిక సిటీ స్టైల్ జిమ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో చేరారు. బైపాస్ సర్జరీ కావడంతో వైద్యుడు శివరామకృష్ణ ఆధ్వర్యంలో శంకరరావుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తొలిసారి ఖమ్మంలో జరిగిన జిల్లాస్థాయి బెంచ్ ప్రెస్ పోటీల్లో 60 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి.. గత నెల 2 నుంచి 7 వరకు కేరళలోని కోజికోడ్‌లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. 83 కిలోల విభాగంలో బరిలోకి దిగి, వ్యక్తిగత విభాగాల్లో మూడు, ఓవరాల్ చాంపియన్‌గా మరో బంగారు పతకం సాధించి, ఔరా అనిపించారు. ఇలా బైపాస్ సర్జరీ అయి, జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన ఏకై క క్రీడాకారుడిగా చరిత్రలో నిలిచిపోయారు.
పతకాలు మిస్..
పతకాలు సాధించిన తర్వాత ఆటోలో శంకర్‌రావు బృందం వారు బస చేసిన చోటుకు బయలుదేరారు. పతకాలు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయి హోటల్ రూమ్‌కు వెళ్లిపోయారు. తర్వాత చూసుకుని కోజికోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆటోను గుర్తించి, మరుసటి రోజు బ్యాగును పోలీసులు శంకర్‌రావుకు అప్పగించారు.
రికార్డుల కోసం నమోదు
శంకర్‌రావు తాను సాధించిన ఘనతలపై లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ రికార్డ్స్ అకాడమీ, బెస్ట్ ఆఫ్ ఇండియన్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేశారు. బైపాస్ సర్జరీ చేసుకుని కూడా ఒకేసారి నాలుగు బంగారు పతకాలు సాధించిన తీరుకు సంబంధించిన పూర్తి సమాచారం పంపించారు.
జీవితంలో ఏదో సాదించాలనే తపన శంకర్‌రావులో చూసి పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ ఇచ్చాం. కానీ మా అంచనాలకు మించి ఆయన బంగారు పతకాలు సాధిస్తుంటే ఆశ్చర్యమేసింది. జాతీయస్థాయి పోటీల్లో ఒకేసారి నాలుగు బంగారు పతకాలు సాధించడంతో ఎంతో ఆనందపడ్డాం. 73 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలా వర్కవుట్‌లు చేస్తుంటారు. తన లక్ష్యాల సాధనకు మా వంతు కృషి చేస్తాం. –రామిరెడ్డి, జిమ్ కోచ్, భద్రాచలం
జాతీయస్థాయిలో ఒకే సారి నాలుగు బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది. ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్నాను. అనుకోకుండా పవర్ లిఫ్టింగ్ నేర్చుకుని జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించడం కలగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన శిక్షకుడు రామిరెడ్డికి, వైద్యుడు శివరామకృష్ణకు ధన్యవాదాలు.
–డీవీ శంకర్‌రావు, పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు

అలుపెరుగని ఆటసారి..

అలుపెరుగని ఆటసారి..

అలుపెరుగని ఆటసారి..