
కొనసాగుతున్న నిమజ్జనం
● రాష్ట్ర నలుమూలల నుంచి గణనాథులతో తరలివచ్చిన భక్తులు ● గోదావరి ఒడ్డుకు ఇప్పటివరకు 1,595 ప్రతిమలు ● ఆకట్టుకున్న విభిన్న రూపాలు, విగ్రహాలు ● భారీ విగ్రహాల నిమజ్జనంలో ఆలస్యం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని గోదా వరిలో నిమజ్జనం చేసేందుకు రాష్ట్ర నలుమూలాల నుంచి వినాయకుడి విగ్రహాలతో భక్తులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీగా చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి కూడా విరామం లేకుండా సిబ్బంది వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు. కాగా, ఆదివారం ఉదయం కూనవరం రోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నుంచి నిమజ్జన ఘాట్ వరకు బారులుదీరిన గణనాథులను ఒక్కొక్కటిగా గోదావరి ఒడ్డుకు చేర్చారు. రెండు రోజులుగా భద్రాచలంలో ఎండతీవ్రత ఎక్కువ గా ఉండటం ఆదివారం వర్షం పడటంతో నిమజ్జన ఘాట్ చల్లగా మారింది. ఆదివారం సాయంత్రం వరకు 353 గణేశ్ విగ్రహాలు రాగా, వీటిలో భారీ విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి నిమజ్జనం ఆలస్యమైంది. వారం రోజులుగా 1,595 గణపతి విగ్రహాలు గోదావరిలో నిమజ్జనమయ్యాయని సిబ్బంది తెలిపారు.
బల్లకట్టు ఏర్పాటు చేస్తే..
ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్న గోదావరిలో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు రెండు లాంచీలను ఏర్పాటు చేశారు. కాగా ఇందులో ఒక లాంచీకి గేర్ బాక్స్‌లో సమస్య తలెత్తడంతో మరో చిన్న బోట్‌కు తాడుకట్టి నిమజ్జనానికి తీసుకు వెళ్లాల్సివస్తోంది. వచ్చే ఏడాది వరకై నా గోదావరిలో బల్లకట్టు ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవని భక్తులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది బల్లకట్టు ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అనుకున్నప్పటిటీ సాధ్యం కాలేదు. ఈ నెల 4న నిమజ్జన ఘాట్‌కు వచ్చిన కలెక్టర్ బల్లకట్టు ఏర్పాటుపై చర్చించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న లాంచీలు కూడా పాతవి. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు బల్లకట్టు ఏర్పాటుపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

కొనసాగుతున్న నిమజ్జనం