
తహసీల్దార్‌ను బురిడీకొట్టించిన మాఫియా!
అశ్వారావుపేటరూరల్: అనుమతి లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్న మట్టి, ఇసుక మాఫియా ముఠాకు చెందిన కొందరు తహసీల్దార్‌కు చిక్కినట్లే చిక్కి బురిడీ కొట్టించి పారిపోయారు. మండలంలోని ఊట్లపల్లి, వినాయకపురం, జగన్నాథపురం, ఊట్లపల్లి గ్రామాల వైపు ఇసుక, మట్టిను ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తహసీల్దార్ సీహెచ్‌వీ రామకృష్ణ సిబ్బందితో కలిసి అశ్వారావుపేట–వినాయకపురం మార్గంలో తనిఖీ లు చేపట్టారు. ఈ క్రమంలో 8 ట్రాక్టర్లను పట్టుకుని పత్రాలను పరిశీలించగా, రెండింటికి మాత్రమే ఇసుక రవాణా అనుమతి పత్రాలు ఉన్నట్లు తేలింది. అనుమతి లేని ఆరు ట్రాక్టర్లను పట్టుకుని తన సిబ్బందితో తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. కాగా, పట్టుబడిన ట్రాక్టర్లను సిబ్బంది కార్యాలయానికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ట్రాక్టర్లతో సహా పారిపోయారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ.. ట్రాక్టర్లను సీజ్ చేసేందుకు కార్యాలయానికి పంపించామని, కానీ మార్గమధ్యలో నుంచి పారిపోయినట్లు సిబ్బంది చెప్పారని తెలిపారు. ట్రాక్టర్ల వివరాలను సేకరించి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు.
పట్టుకున్న ట్రాక్టర్లతో సహా పరారీ