
నేచర్ పార్కులో సౌకర్యాలు కల్పిస్తాం
పాల్వంచరూరల్/ఇల్లెందు రూరల్/గుండాల: ఇల్లెందు కోరగుట్ట చుట్టూ అటవీశాఖ తీర్చిదిద్దిన నేచర్ పార్క్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ అన్నారు. ఇల్లెందు మండలం రొంపేడు అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్‌ను, కోరగుట్ట వద్ద నేచర్ పార్క్‌ను శుక్రవారం ఆమె సందర్శించారు. కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని రేగళ్ల, ఆళ్లపల్లి, రంగాపురం ఏరియాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ప్లాంటేషన్లు, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫలాలనిచ్చే మొక్కలు నాటాలని సూచించారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌ను ప్రారంభించారు. శనివారం కిన్నెరసాని డీర్ పార్కు, జలాశయం మధ్యలోని ఆనంద ద్వీపాన్ని సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్ భీమా నాయక్, డీఎఫ్‌వో కిష్టాగౌడ్, ఎఫ్‌డీఓలు బాబు, కరుణాకరాచారి, ఎఫ్‌ఆర్‌ఓ చలపతిరావు, డీఆర్‌వోలు వెంకటరావు, వీరబాబు, ఎఫ్‌బీఓ సుజాత పాల్గొన్నారు.
పీసీసీఎఫ్ సువర్ణ