
‘స్వగృహ’ మాకే కావాలి!
ఫ్లాట్ల కోసం వ్యాపారుల పోటాపోటీ
ఇప్పటికే కొనుగోళ్లకు
ఉద్యోగుల నిర్ణయం
అన్నీ సవ్యంగా ఉండడంతో
వ్యాపారుల దృష్టి
అప్పడు వద్దు.. ఇప్పుడు కావాలి
ఖమ్మం సహకారనగర్: ఎన్నో ఏళ్ల అనంతరం సొంత ఇంటి కల నెరవేరుతుందనే ఆశతో ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా... వారి ఆశలను అడియాసలు చేసేలా కొందరు వ్యాపారులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో ఏళ్ల క్రితం రాజీవ్ స్వగృహ పేరిట నిర్మాణం మొదలుపెట్టిన అపార్ట్‌మెంట్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఆతర్వాత ఎవరూ పట్టించుకోలేదు. సుమారు ఏడేళ్లుగా ఉన్నవి ఉన్నట్లుగా తమకు కేటాయిస్తే మిగతా నిర్మాణం చేసుకుంటామని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన పలు మార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, చివరకు ముఖ్యమంత్రిని సైతం కలిశారు. ఈ వినతిపై ఇటీవలే స్పందన రావడంతో ఒక్కో అడుగు ముందుకు పడుతుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగడం వారిని ఆందోళనకు గురిచేస్తోందని సమాచారం.
హౌసింగ్ పీడీ పరిశీలన
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఉద్యోగులకు నిర్ణీత ధరతో కేటాయించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన సమావేశమై ఫ్లాట్ల ధర చదరపు అడుగుకురూ.1,150గా నిర్ణయించారు. అదే అభివృద్ధి చేశాక రూ.2,500గా ఖరారు చేశారు. అభివృద్ధి తర్వాత రాజీవ్ స్వగృహ ప్రాంగణం ఎలా మారనుందో బ్రోచర్లు ముద్రించారు. ఈక్రమంలోనే హౌసింగ్ పీడీ వీ.పీ.గౌతమ్ ఇటీవల పరిశీలించి సూచనలు చేశారు. ఆపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ కూడా సమీక్షించి రాజీవ్ స్వగృహ ప్రాంగణాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలంగాణ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి కేటాయిస్తామని ప్రకటించారు.
తొలి దఫాగా రూ.5కోట్లు
రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం తొలిదశలో ప్రభుత్వానికి రూ.5కోట్లు చెల్లించాల్సి ఉండడంతో నగదు సేకరణలో ఉద్యోగ సంఘాలు నిమగ్నమయ్యాయి. అలాగే, ఖమ్మం కలెక్టర్ సమీక్ష సందర్భంగా మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నందున వరద నుంచి ఎలాంటి ముప్పు ఉండదని, బఫర్ జోన్ కాకపోవడంతో భవిష్యత్‌లోనూ ఇబ్బందులు ఉండవని తెలిపారు. దీంతో ఉద్యోగులు ఫ్లాట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.
గతంలో రెండు సార్లు రాజీవ్ స్వగృహను వేలం వేయగా ఏ ఒక్క వ్యాపారి ముందుకు రాలేదు. కనీసం టెండర్లు కూడా దాఖలు చేయలేదు. కానీ మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తుండడం, నిర్మాణ ప్రాంతం బఫర్ జోన్ పరిధిలోకి రాదని ఏకంగా ఖమ్మం కలెక్టర్ ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుకొస్తున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన నిర్మించిన బ్రోచర్లు కూడా ఆకట్టుకునేలా ఉండడంతో వ్యాపారులే సముదాయాన్ని దక్కించుకుని అభివృద్ధి చేశాక అధిక ధరలో అమ్ముకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అయితే, ఏళ్ల అనంతరం సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో ఉన్న ఉద్యోగులు ఈ ప్రచారంతో ఆందోళన చెందుతుండగా.. ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

‘స్వగృహ’ మాకే కావాలి!