హోరాహోరీగా ప్రచారం | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ప్రచారం

Sep 6 2025 5:19 AM | Updated on Sep 6 2025 5:19 AM

హోరాహోరీగా ప్రచారం

హోరాహోరీగా ప్రచారం

● ఈ నెల 10న కేటీపీఎస్‌ ఉద్యోగుల క్రెడిట్‌ సొసైటీ ఎన్నికలు ● రాజకీయ పార్టీల తరహాలో హంగూ ఆర్భాటాలు

పాల్వంచ: కేటీపీఎస్‌, బీటీపీఎస్‌, వైటీపీఎస్‌ ఉద్యోగుల క్రెడిట్‌ సొసైటీ(పాల్వంచ) ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 3,008 ఓట్లు ఉండగా, గెలుపే లక్ష్యంగా ఎవరికీవారు పావులు కదుపుతున్నారు. రాజకీయ పార్టీల తరహాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 13 డైరెక్టర్‌ పోస్టులకు 46 మంది నామినేషన్లను సమర్పించారు. ముగ్గురు రెండుసార్లు సమర్పించడంతో స్క్రూట్నీలో తొలగించారు. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో 37 మంది మిగిలారు. గురువారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచార హోరు సాగిస్తున్నారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కర్మాగారంలో వివిధ విభాగాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కార్మికుల ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని కోరుతున్నారు.

మూడు చోట్ల పోలింగ్‌

ఈ నెల 10న మూడు కర్మాగారాల్లో ఓటింగ్‌ జరగనుంది. కేటీపీఎస్‌ డీఏవీ పాఠశాలలో మూడు బూత్‌లు, బీటీపీఎస్‌(మణుగూరు)లో రెండు బూత్‌లు, వైటీపీఎస్‌(దామరచర్ల, నల్లగొండ)లో రెండు బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం పాల్వంచలో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

ప్రచారానికి రూ. లక్షల్లో ఖర్చు

అభ్యర్థులు ప్రచారానికి రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లోని కాలనీలు, కర్మాగారాల పరిసరాలు, కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సామాజిక వర్గాల వారీగా ఓట్లు రాబట్టుకునేందుకు మూడు రోజులుగా మద్యం పార్టీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికులతో బేరసారాలు సాగిస్తూ ఎన్నికల ముందు రోజు నగదు పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు సైతం విధులకు డుమ్మా కొట్టి ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

కరకగూడెం: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై శుక్రవారం మణుగూరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి విచారణ చేపట్టారు. చిరుమళ్ల గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర భార్య చందా భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కరకగూడెం మండల కేంద్రంలోని ఆమెకు చెందిన పట్టా భూమిని కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌తో దున్నిన ఘటనలో కేసు నమోదుకాగా, డీఎస్పీ విచారించారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఘటనాస్థలిని పరిశీలించి, సాక్షులను విచారించారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement