
కెమిస్ట్రీ అధ్యాపకుడికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్రం అధ్యాపకుడు గుగులోతు వీరన్నకు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ నుంచి డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్లు వడ్డే రవీందర్, సీహెచ్.వెంకటరమణారెడ్డి పర్యవేక్షణలో ఆయన ‘న్యూ పర్సెక్టివ్స్ ఇన్‌ట్రాన్షిషన్ మెటల్ క్యాటలిస్టు డిజైన్ సింథసిస్ అండ్ హోమోజీనియస్ ఆక్సిడేషన్ అండ్ ఇపాక్సిడేషన్’ అంశంపై పరిశోధనాపత్రం సమర్పించారు. ఈమేరకు కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన వీరన్న డాక్టరేట్ అందుకోగా, ఎస్‌ఆర్‌ఎన్ బీజీఎన్‌ఆర్ ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా, అధ్యాపకులు ఏఎల్.శాస్త్రి, ఎం.మాధవరావు, సీహెచ్.సుధాకర్, పి.సర్వేశ్వరరావు, ఎం.సునంద, సత్యవతి తదితరులు అభినందనలు తెలిపారు.
సంత వేలం..
రూ.6.63లక్షలు
కారేపల్లి సంతకు గత ఏడాది కంటే రూ.1.33లక్షలు అధికం
కారేపల్లి: కారేపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యాన ప్రతీ ఆదివారం కొనసాగే సంత నిర్వహణను అప్పగించేందుకు శుక్రవారం వేలం నిర్వహించారు. నార్కట్‌పల్లికి చెందిన వెంకటేశ్వర్లు, కారేపల్లికి రాము, పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేష్‌బాబు యాదవ్, రాములు పాల్గొనగా ఏడా ది కాలానికి అత్యధికంగా రూ.6.63లక్షలకు పాడిన మహేష్‌బాబు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.5.30లక్షలు పలకగా ఈసారి రూ.1.33లక్షలు అధికంగా నమోదైంది. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ నల్లమోతు శేషయ్య ఆధ్వర్యాన వేలం నిర్వహించగా సంతగుడి మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్‌తో పాటు వాసురెడ్డి సంపత్, మూడ్ మోహన్ చౌహాన్, జవ్వాజి రంగయ్య పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
దమ్మపేట: మండలంలోని చిన్నగొల్లగూడెం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు శుక్రవారం దాడిచేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, ఏడుగురు వ్యక్తులు పరారయ్యారు. మూడు ద్విచక్ర వాహనాలు, రూ.2,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.

కెమిస్ట్రీ అధ్యాపకుడికి డాక్టరేట్