
● అంకితభావంతోనే అవార్డు
పాల్వంచ: పాల్వంచలోని కొమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు పర్చా సత్య శ్రీదేవి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. తాను బోధించే గణితంలో పదో తరగతిలో 100 శాతం ఫలితాలు రావడమే కాక, సొంత డబ్బుతో పాఠశాలలో పలు సౌకర్యాలు కల్పించారు. 1996లో ఉద్యోగంలో చేరిన సత్య శ్రీదేవి..మొదట పాల్వంచ అభ్యున్నత బాలికోన్నత పాఠశాలలో పని చేసి, కొమ్ముగూడెం పాఠశాలకు బదిలీ అయ్యారు. సమయ పాలన, విధుల్లో అంకితభావంతో ఉండడమే కాక విద్యార్థులతో కలిసిపోయి చదువులో ప్రోత్సహించేవారు. రూ.70వేల వ్యయంతో పాఠశాలలో ఆర్‌ఓఆర్ వాటర్ ప్లాంట్, రూ.35 వేలతో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేశారు. విస్తృతంగా మొక్కలు నాటించడమే కాక సొంత ఖర్చుతో పలు రకాల హెర్బల్, క్రోటాన్, పూల మొక్కలు నాటించి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా కృషి చేశారు. అంతేగాక తెలంగాణా మ్యాఽథ్స్ టీచర్స్ ఫోరం సభ్యురాలిగా ఎన్నికై పలు కార్యక్రమాలు నిర్వహించారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.