
● వసతుల కల్పనకు కృషి
ఇల్లెందురూరల్: మండలంలోని ముత్తారపుకట్ట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కబ్బాకుల రవి నిబద్ధతతో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులకు గుణాత్మకవిద్య అందించడంతోపాటు సామాజిక సేవలో భాగస్వాములను చేస్తున్నారు. ఏ పాఠశాలలో పనిచేసినా మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారు. రవి అంకితభావాన్ని గుర్తించిన గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మార్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు సొంత డబ్బుతో కరపత్రాలు వేయించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. బాల కార్మికులు, బడిబయట పిల్లలను గుర్తించి పాఠశాల, వసతిగృహాల్లో చేర్పించారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములు చేస్తున్నారు. దాతల సాయంతో విద్యార్థులకు ప్లేట్లు, టేబుళ్లు, కుర్చీలు, నోటుపుస్తకాలు, టీవీ, సౌండ్‌బాక్స్‌లు, బీరువా తదితర సౌకర్యాలు సమకూర్చారు. బాలల కమిటీలు వేసి పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బ్యాడ్జీలు పెట్టి ప్రోత్సహించడం, తల్లిదండ్రులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆదివాసీ హెల్ప్ సెంటర్ ద్వారా సామాజిక సేవలు కూడా అందిస్తున్నారు.