
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బాలింత మృతి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గురువారం ఉదయం మూడు రోజుల బాలింత మృతి చెందింది. బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్‌కు చెందిన గర్భిణి అంజలముడి సింధు (25)ను ప్రసవం కోసం ఈ నెల 1న మధ్యాహ్నం ఆస్పత్రిలో చేర్చారు. అదే రోజు సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయగా, ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా బుధవారం ఉదయం సింధు నోట్లో నుంచి నురగ వచ్చి, కోమాలోకి వెళ్లింది. దీంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. స్థానిక కార్డియాలజిస్ట్ సాయితేజ రెడ్డి వచ్చి పరీక్షించగా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. పుట్టిన బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణను వివరణ కోరగా.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందలేదని, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డం కట్టడంతో మృతి చెందిందని తెలిపారు.