
పోడు సాగు వివాదం
జూలూరుపాడు: మండలంలోని ఎలుకలొడ్డు గ్రామ సమీపంలో పోడు సాగు వివాదం నెలకొంది. పాపకొల్లు బీట్–బీ, కంపార్ట్‌మెంట్ 31లోని రాసగానిగుట్ట దగ్గరలో అటవీ అధికారులకు, గొత్తికోయలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. కొందరు గొత్తికోయలు అక్రమంగా మారుజాతి, తదితర కలప చెట్లు నరికి పోడు భూమిలో పత్తి సాగు చేపట్టారు. ఈ క్రమంలో గత నెల 29న పాపకొల్లు అటవీ సెక్షన్ ఆఫీసర్ మల్లయ్య, బీట్–బీ ఆఫీసర్ కె.విజయలక్ష్మి, వాచర్ తేజావత్ రాము అటవీభూమిలో వెదురు మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆదివాసీలకు, అటవీశాఖ సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. గొత్తికోయ మహిళ ఇడిమా, ఎఫ్‌బీఓ విజయలక్ష్మి మధ్య పెనుగులాట జరిగింది. పెనుగులాడుతున్న దృశ్యాలు గురువారం సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా 29నే బీట్ ఆఫీసర్ విజయలక్ష్మి జూలూరుపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీలు మడి సీతారాములు, మడి ప్రవీణ్, మడి ముత్తమ్మలు ఇడిమాను రెచ్చగొట్టారని, దీంతో ఆమె ఎఫ్‌బీఓపై రాయితో దాడి చేసిందని, బచ్చల నర్సమ్మ అనే మహిళ కూడా దురుసుగా ప్రవర్తించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీట్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మడి సీతారాములు, ప్రవీణ్, ముత్తమ్మ, ఇడిమా, నర్సమ్మ ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాదావత్ రవి తెలిపారు.
29న ఫిర్యాదు చేస్తే.. 4న కేసు నమోదు
పోడు సాగును అడ్డుకునేందుకు వెళ్లిన ఎఫ్‌బీఓ విజయలక్ష్మి, గొత్తికోయ మహిళ మధ్య ఘర్షణ జరిగిందని జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌ఓ జి.ప్రసాద్‌రావు తెలిపారు. ఎఫ్‌బీఓపై గొత్తికోయ మహిళ దాడి చేసిందన్నారు. కాగా ఈ ఘటనపై గత నెల 29న అటవీశాఖ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు గురువారం విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేశాక ఆరు రోజుల తర్వాత కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఎఫ్‌బీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ తనను దూషించి, దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అటవీ ప్రాంతంలో విధులకు వెళ్లాలంటేనే భయంగా ఉందని పేర్కొంది.
ఐదుగురిపై కేసు నమోదు