
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఖమ్మం ఎంపీ
రఘురాంరెడ్డి
సుజాతనగర్/కొత్తగూడెం అర్బన్: పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. సుజాతనగర్, సింగభూపాలెం, గరీభ్‌పేట, లక్ష్మీదేవిపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 134 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను స్థాఽనిక రైతు వేదికలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రూ.60 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చుంచుపల్లి మండలం ధన్‌బాద్, అంబేద్కర్ నగర్, రాంపూర్‌లో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించినట్లు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి, లక్ష్మీదేవిపల్లిలో రూ.24 లక్షల వ్యయంతో నిర్మించిన జీపీ కార్యాలయ మీటింగ్ హాల్, అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించామని వివరించారు. విద్యానగర్, సారయ్య కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.70 లక్షలతో వాటర్ ట్యాంక్, నూతన పైప్ లైన్ నిర్మాణం, పైపులైన్ల పొడగింపు పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. విద్యానగర్‌లో రూ.5.22 కోట్ల ఎల్‌డబ్ల్యూఈ నిధులతో నిర్మించిన భవనంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, సొసైటీ చైర్మెన్ మండె వీరహనుమంతరావు, ఎంపీడీఓ బి.భారతి, తహసీల్దార్ వి.కృష్ణప్రసాద్, నాయకులు చింతలపూడి రాజశేఖర్, నాగ సీతారాములు, ఆళ్ల మురళి, సొసైటీ చైర్మన్ హన్మంతరావు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, కూచిపూడి జగన్, రజాక్, పూనెం శ్రీనివాస్ పాల్గొన్నారు.