
● అవయవాల ఆకృతులతో..
మణుగూరు టౌన్: మణుగూరు జెడ్పీ పాఠశాలలో సైన్స్ టీచర్ పరమయ్య ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. పాఠాలను ప్రయోగపూర్వకంగా చెబుతూ విద్యార్థుల్లో సైన్స్‌పట్ల ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మనిషిని పోలిన విధంగా ఉండే మేక గుండె, ఊపిరితిత్తులు వంటి భాగాలను పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు వాటి పని విధానంపై వివరిస్తారు. చార్ట్ వర్క్‌లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారిలో పరిజ్ఞానం పెంచేందుకు కృషిచేస్తున్నారు. చమ్కీలు, చొక్కా బటన్స్, స్టిక్కర్స్, క్లే, దారం వంటి వాటితో మానవ అవయవాల ఆకృతులు తయారు చేసి బోధన చేపడుతున్నారు. వీఆర్, ఏఆర్ టెక్నాలజీని సమ్మిళితం చేసి పాఠాలు బోధిస్తున్నారు. ఎన్‌జీసీ(నేషనల్ గ్రీన్ కార్ప్)లో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్‌గా ఐదేళ్లు పనిచేసిన ఆయన ఉత్తమ టీచర్స్ లెర్నింగ్ మెటీరియల్స్ (టీఎల్‌ఎం) తయారు చేశారు. అది దేశ వ్యాప్తంగా రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లో జరిగిన సీసీఆర్‌టీకి ఎంపికై ంది. పలుమార్లు జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు బోధనాపద్ధతులపై శిక్షణ కూడా ఇచ్చారు.
విద్యార్థులకు బోధించే పాఠం ఎంతమేరకు అర్థమవుతుందనేదే ముఖ్యం. మారుతున్న టెక్నాలజీతో పాటు దైనందిన అంశాలతో ముడి పడి ఉన్న అంశాలు క్షుణ్ణంగా వివరించాలి. ప్రయోగాలు చేస్తూ వాటిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ విద్యాబోధన చేయడం వారికి పరిజ్ఞానం పెరుగుతుంది.
–పరమయ్య, సైన్స్ ఉపాధ్యాయుడు