
45 కేజీల గంజాయి స్వాధీనం
ఇల్లెందు: భద్రాచలం, ఇల్లెందుల మీదుగా ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను కథనం ప్రకారం.. ఎస్‌ఐ పి.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది సోమవారం బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి మహా రాష్ట్రకు కారులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కోట్యాతండాకు చెందిన తేజావత్ శంకర్, తేజావత్ జమ్కు, సూర్యపేట జిల్లా రాజు నాయక్ తండాకు చెందిన అంగోతు సంతుగా తేలింది. నిందితులను అరెస్ట్ చేసి, కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 22.62 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒడిశాకు చెందిన రాము, తాతారావు, మహారాష్ట్రకు చెందిన హరిబాబు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, నిందితులను ముగ్గురిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు. సీఐ టి. సురేష్, ఎస్‌ఐ పి. శ్రీనివాస రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్, కారు సీజ్