
దళారులకు చెక్..
నాడు దళారులదే రాజ్యం..
ఒకప్పటి ఆనవాయితీ కొనసాగిస్తూ సింగరేణి కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ఇచ్చిన వెసులుబాటు.. మెడికల్ బోర్డును అవినీతికి కేరాఫ్‌గా మార్చింది. కారుణ్య నియామక కోటాలో వారసత్వ ఉద్యోగాలు కల్పించేందుకు నిర్వహించే అనారోగ్య పరీక్షలు, ఆ తర్వాత జరిగే తంతులో దళారులు ప్రవేశించారు. గని స్థాయిలో సంక్షేమాధికారికి దరఖాస్తు చేయడానికి ముందే ఈ వ్యవహారంలో చొరబడి.. కీలకమైన అనారోగ్య పరీక్షలు నిర్వహించే మెడికల్ బోర్డు వరకు అంతా తామే చూసుకుంటామంటూ కార్మికులకు మాయమాటలు చెప్పేవారు. ఒక కార్మికుడిని అనారోగ్య కారణాలతో అన్‌ఫిట్ చేయించి అతడి వారసుడికి ఉద్యోగం ఇప్పించేందుకు కనీసం రూ.5లక్షల నుంచి రూ. 8లక్షల వరకు చేతులు మారడం సర్వసాధారణ వ్యవహారంగా నిలిచింది. ఈ దళారుల దందాకు ఆరంభంలోనే బ్రేకులు వేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం పొరపాటుగా పరిణమించింది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మెడికల్ బోర్డులో అవినీతి వ్యవహారాలు శృతి మించుతున్నాయనే ఆరోపణలు రావడంతో గత ఆరు నెలలుగా సింగరేణి సంస్థ మెడికల్ బోర్డు నిర్వహణపై ఆచితూచి వ్యవహరిస్తోంది. కొత్తగా కార్మికుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించకుండా, గతంలో నిర్వహించిన బోర్డుల్లో సెకండ్ ఒపీనియన్ కోసం హయ్యర్ రిఫరల్ చేసిన కేసులకే ప్రత్యేకంగా జూలై 30, 31 తేదీల్లో మెడికల్ బోర్డు ద్వారా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. 54 మంది కార్మికులు/ఉద్యోగులను వైద్య పరీక్షల కోసం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రికి పిలవగా 53 మంది హాజరయ్యారు. కాగా, పరీక్షల తర్వాత మెడికల్ బోర్డు వెల్లడించిన ఫలితాలు సింగరేణి వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
తొమ్మిది శాతమే..
మెడికల్ బోర్డు ద్వారా అనారోగ్య కారణాల రీత్యా తమను అన్‌ఫిట్ చేసి వారసులకు సంస్థలో ఉద్యోగాలు ఇవ్వాలంటూ 53 మంది కార్మికులు ఆర్జీ పెట్టుకుంటే.. ఇందులో ఐదుగురే అన్‌ఫిట్‌గా తేలారు. 17 మంది కార్మికులు భూగర్భ గనుల్లో పని చేసేందుకు ఫిట్‌గా లేరని, వీరికి ఉపరితలంలో పని కల్పించాలని సూచించారు. వీరు కాకుండా మిగిలిన 31 మంది కార్మికులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మెడికల్ బోర్డు తేల్చి చెప్పింది. మొత్తంగా తొమ్మిది శాతం మంది ఉద్యోగులే అన్‌ఫిట్ కావడం గమనార్హం. గతంలో సుమారు 70 శాతం మంది కార్మికులు అన్‌ఫిట్ అయితే, మరో 20 శాతం మందిని హయ్యర్ రిఫరల్‌కు పంపేవారు. వారసత్వ ఉద్యోగాల పేరుతో దళారులు చక్రం తిప్పడం వల్లే మెడికల్ బోర్డు ఫలితాల్లో అన్‌ఫిట్ శాతం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
ప్రక్షాళన బాటలో..
దళారుల అండ లేకుంటే తమ పిల్లలకు ఉద్యోగాలు రావనే అభిప్రాయం కార్మికుల్లో బలపడింది. దీంతో కాయకష్టం చేసి ఆర్జించిన సొమ్ముతో పాటు అప్పు చేసి దళారుల జేబులు నింపడం పరిపాటిగా మారింది. ‘కారుణ్య నియామకాలు – అవినీతి దందా’పై వరుసగా వార్తా కథనాలు రావడం, సంస్థ ప్రతిష్టకు మచ్చగా నిలుస్తుండడంతో ఈ ఏడాది జనవరి నుంచి సింగరేణి యాజమాన్యం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. సంస్థ పరంగా విజిలెన్స్ నిఘా పెంచడంతో పాటు ఏసీబీకి విచారణ బాధ్యతలు అప్పగించింది. ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్‌తో పాటు ఈ మెయిల్ అడ్రెస్‌ను సీఎండీ బలరామ్ నాయక్ అందుబాటులోకి తెచ్చారు. ఈ చర్యల ఫలితమే గడిచిన కొన్ని నెలలుగా సింగరేణి కేంద్రంగా జరుగుతున్న ఏసీబీ అరెస్టులు. తాజాగా 54 మంది కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహిస్తే ఇందులో ఐదుగురు కార్మికులే అన్‌ఫిట్ అయ్యారు. ఈ మార్పుతో మెడికల్ బోర్డు దళారీ వ్యవస్థ గప్‌చుప్ అయింది. మార్చి తర్వాత మెడికల్ బోర్డు పెట్టడం లేదంటూ నిన్నా మొన్నటి వరకు సన్నాయి నొక్కులు నొక్కిన వారు ఇప్పుడు కిమ్మనడం లేదు. మరోవైపు బోర్డులో అవినీతి ప్రక్షాళనపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి మెడికల్ బోర్డుపై ఏసీబీ నజర్
అనారోగ్యం బారిన పడిన వారే అన్‌ఫిట్
54 మందికి పరీక్షలు.. ఐదుగురికే దక్కిన ‘వారసత్వం’
49 మంది కార్మికులు తిరిగి విధుల్లోకే..
సంస్థ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న కార్మికులు