
రామాలయంలో కియాస్క్ మిషన్ ప్రారంభం
భద్రాచలంటౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఫెడరల్ బ్యాంక్ వారు అందజేసిన రెండో కియాస్క్ మిషన్‌ను ఈఓ ఎల్.రమాదేవి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులు ఈ మిషన్‌ను ఉపయోగించుకుని అవసరమైన ప్రసాదాలను పొందవచ్చని తెలిపారు. నిమిషం లోపే టోకెన్ పొంది, ప్రసాదం తీసుకునేలా ఏర్పాటు చేశామని చెప్పారు. కియాస్క్ మిషన్లకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీంద్రనాథ్, ఏఈఓ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లాకు 26 పతకాలు
కొత్తగూడెంటౌన్ : హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం ముగిసిన రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు 26 పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ తెలిపారు. ఈ పోటీలకు జిల్లా నుంచి 40 మంది అథ్లెట్లు హాజరు కాగా, 26 మంది పతకాలు సాధించారని, జిల్లాకు ఆరు బంగారు, 14 రజిత, 6 కాంస్య పతకాలు వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్‌ఓ ఎం. పరంధామరెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్, కార్యదర్శి రాజేందర్ తదితరులు అభినందించారు.
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచన
కొత్తగూడెంఅర్బన్ : పోలీస్ శాఖలో పని చేసేవారు క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సోమవారం ఆయన ఏఆర్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అడ్మిన్ ఆర్‌ఐ కార్యాలయంతో పాటు మోటార్ ట్రాన్స్‌పోర్ట్, సంక్షేమ కార్యాలయాలను, హోంగార్డ్ ఆర్‌ఐ ఆఫీసులో రికార్డులను తనిఖీ చేశారు. బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో వినియోగించే సాంకేతికత, శిక్షణను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని అన్నారు. శారీరక, మానసిక దృఢత్వం కోసం నిత్యం వ్యాయామం, యోగా చేయాలని చెప్పారు. అధికారులు, సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎంటీఓ సుధాకర్, హోమ్‌గార్డ్, అడ్మిన్, వెల్ఫేర్ ఆర్‌ఐలు నరసింహారావు, లాల్‌బాబు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓగా జెడ్పీ సీఈఓకు అదనపు బాధ్యతలు
కొత్తగూడెంఅర్బన్ : జిల్లా విద్యాశాఖ అధికారిణిగా జెడ్సీ సీఈఓ నాగలక్ష్మి సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి గత నెల 31న ఉద్యోగ విరమణ చేయగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాగలక్ష్మికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించారు.

రామాలయంలో కియాస్క్ మిషన్ ప్రారంభం

రామాలయంలో కియాస్క్ మిషన్ ప్రారంభం