
రక్తదానంతో ప్రాణ రక్షణ
మణుగూరు టౌన్: ఒక యూనిట్ రక్తదానంతో ఇతరుల ప్రాణాలకు రక్షణ కల్పించొచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. గర్భిణులు, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులతో బాధపడే వారు, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండుసార్లు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆస్పత్రిలో వైద్య పోస్టుల భర్తీకి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కలెక్టర్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ రవిబాబు, సూపరింటెండెంట్ సునీల్, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాస్, సాయిమోహన్, గౌరి పాల్గొన్నారు.
ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగండి..
కరకగూడెం: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని, విద్యార్థులంతా ఉన్నత ఆలోచనతో ముందుకు సాగాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. మండలంలోని భట్టుపల్లి కేజీబీవీని సోమవారం ఆయన తనిఖీ చేశారు. బోధన ఎలా ఉంది, సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను నోట్ చేసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఏ నిధులు రూ.5లక్షలతో అవసరమైన పనులు చేయించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో మునగ, కరివేపాకు, ఉసిరి మొక్కలు నాటాలని, విద్యార్థులకు ఔషధ మొక్కలపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కరకగూడెం జెడ్పీ పాఠశాలను పరిశీలించారు. త్వరలో నవోదయ పాఠశాల ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంటా ప్రతాప్, ఎంఈఓ మంజుల, విద్యాశాఖ ఏఈ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ కాంతయ్య, ఎంపీఓ మారుతీ యాదవ్, కేజీబీవీ ఎస్‌ఓ శ్రీదేవి, ఆర్‌ఐ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ..
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, సిబ్బంది నవీన్ ఉన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి
మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో రక్త నిల్వల కేంద్రం ప్రారంభం

రక్తదానంతో ప్రాణ రక్షణ