
ప్రజావాణికి తగ్గిన జనం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి గతంలో జనం పోటెత్తేవారు. కానీ రాను రాను ఈ కార్యక్రమానికి ఫిర్యాదుదారులు తగ్గుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో పాటు కలెక్టర్ ప్రజావాణికి హాజరయ్యారా లేదా అని ఫోన్‌లో తెలుసుకుంటున్నారు. ఆయన లేరని తెలిస్తే ఆ రోజు ఎక్కువ మంది రావడం లేదు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలనే సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ నిత్యం ఏదో ఒక ప్రాంతానికి వెళుతున్నారు. దీంతో ఆయన ప్రజావాణికి రాలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే వారంలో ఒక పూట మాత్రమే నిర్వహించే ప్రజావాణిలో వినతిపత్రం ఇస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో వస్తున్న వారు కలెక్టర్ లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. పలువురు అధికారులు సైతం శాఖా పరమైన పనుల నిర్వహణతో ప్రజావాణికి హాజరు కావడం లేదు. సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్‌తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండి
ఇల్లెందు మున్సిపాలిటీ 19వ వార్డు గోవింద్ సెంటర్‌కు చెందిన ప్రజలు.. తాము 40 సంవత్సరాలుగా స్థానిక రైల్వే స్థలంలో ఉంటూ ఇంటి పన్నులు, తాగునీటి పంపు బిల్లులు చెల్లిస్తున్నామని, పేదరికంలో ఉన్న తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఆన్‌లైన్‌లో తమ పేర్లు మొదటి లిస్టులో వచ్చాయని, రైల్వే స్థలమనే కారణంతో ఇళ్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పోడు భూములకు పట్టాలివ్వాలి
కొత్తగూడెం కార్పొరేషన్ చిట్టి రామవరం 19వ డివిజన్ వాసులు తమకు పోడు పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. గరీబ్‌పేట పంచాయతీ అంబేద్కర్ నగర్ బీట్‌లోని అటవీ భూమిని 45 ఏళ్లుగా పోడు చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోడు భూములకు పట్టాలివ్వాలని ఆదేశించినందున తమకు కూడా జారీ చేయాలని కోరారు. ఈ మేరకు సీపీఐ నాయకులు బానోత్ చందర్, బానోత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో రైతులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.