
ఓసీ విస్తరణ వైపు అడుగులు
● రెండు గ్రామాల్లో భూసేకరణకు ప్రజామోదం ● కార్మికులు, అధికారుల్లో హర్షాతిరేకాలు ● 455.7 ఎకరాల భూమికి లైన్ క్లియర్
మణుగూరుటౌన్: పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, బొగ్గు వినియోగం, ప్రత్యక్ష, పరోక్షంగా ఆధారపడిన కంపెనీలు, స్థానికంగా ఉపాధి పొందుతున్న వందలాది కుటుంబాలు మణుగూరు ఓసీ విస్తరణ కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రతిపాదిత గ్రామాలైన మణుగూరు, తిర్లాపురం, రామానుజవరంలో రెండు గ్రామాల ప్రజలు భూసేకరణకు గ్రామసభల్లో ఆమోదం తెలపారు. దీంతో సింగరేణి మణుగూరు ఓసీ విస్తరణపై ఇటు అధికారులు, అటు కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఏరియా ఓసీ–2, ఓసీ–4, మణుగూరు ఓసీ, కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్ గనుల నుంచి ఏటా వందల టన్నుల బొగ్గును అందిస్తూ రాష్ట్ర, దేశ అభివృద్ధిలో తనవంతుగా మణుగూరు ఏరియా భాగస్వామ్యం అవుతోంది. ఈ నేపథ్యంలో మణుగూరు ఓసీ బొగ్గు నిల్వలు అడుగంటుతుండటం మరో ఆరు నెలల్లో గని మూతపడే పరిస్థితికి రావడంతో ఓసీ విస్తరణ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో (దాదాపు ఏడాదిన్నర సమయం అనంతరం) గ్రామస్తులు భూసేకరకు ఆమోదం తెలిపడంతో సింగరేణి అధికారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరో 20 ఏళ్లు మణుగూరులో తమ ప్రస్థానం కొనసాగిస్తూ సమీప గ్రామాల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటునందించే అవకాశం లభిస్తుందని తమ కృషికి తగిన ఫలితం దక్కుతోందని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2024లో నిర్ణయం
మణుగూరు ఓసీ విస్తరణకు భూ సేకరణ జరపాలని 2024 ఫిబ్రవరి 7వ తేదీన సింగరేణి అధికారులు ప్రభుత్వానికి తెలుపారు. అందుకుగాను స్పె షల్ డిప్యూటీ కలెక్టర్ సుమను నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతిపాదిత మణుగూరు మున్సిపాలిటీలోని కొమ్ముగూడె, తిర్లాపురం, రామానుజవరం గ్రామాల్లో 813 ఎకరాల భూ సేకరణకు ఒక్కోచోట మూడు సార్లు గ్రామసభలు నిర్వహించినా, క్షేత్రస్థాయిలో పర్యటించి నచ్చజెప్పినా ఫలితం లభించలేదు. శాశ్వత ఉపాధి కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. అధికారులు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం, ఓసీ విస్తరణలో ఏర్పడే అవకాశాలు నిర్వాసితులకే అవసరమైతే శిక్షణ కూడా ఇచ్చేందుకు భరోసా కల్పించారు.
ఎకరానికి రూ.22.50 లక్షల పరిహారం..
తాజాగా మణుగూరు పట్టణంలోని కొమ్ముగూడెం, తిర్లాపురం గ్రామాల్లో ప్రజామోదం లభించడం పట్ల సింహభాగం పూర్తయినట్లు అధికారులు భావిస్తున్నారు. సేకరించనున్న 813 ఎకరాల భూ సేకరణలో రెండు గ్రామాల రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో 455.7ఎకరాలకు గ్రామస్తులు ఆమోదం తెలిపినట్లయింది. సింగరేణి పూర్తిగా వ్యవసాయ భూమి సేకరణపైనే దృష్టి సారించగా, నివాసాలు ఎవరూ కోల్పోవడం లేదు. ఏజెన్సీ చట్టాలను అనుసరించి గిరిజనులకు ఎకరాకు 22.50 లక్షలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.5.50 లక్షలు, పొలంలోని, మోటార్లు, చెట్లు, ఇతర పనిముట్లకు విలువ కట్టి అదనంగా ఇచ్చేందుకు నిర్ణయించారు. గిరిజనేతరులకు, పట్టాలేని వారికి ఎకరాకు రూ.11.2.5 లక్షలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇతర ప్రయోజనాలు అందించనున్నారు. పెద్ద చెరు వు, రాయుగటకుంట, చింతకుంట, బుర్దన్‌వాయ్ కుంట, మల్లంపాడు చెరువుల అభివృద్ధికి రూ. 17.45 కోట్లు కేటాయించారు. ఆయా చెరువులపై ఆధారపడిన, రిజిస్టర్ అయిన సొసైటీలో సభ్యత్వం ఉండి ఉపాధి కోల్పోయే వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించేందుకు నిర్ణయించారు. ప్రాజెక్ట్ మొత్తం 300 కుటుంబాలు ఉండగా, 500 మంది పీఏఎఫ్ (ప్రాజెక్ట్ ప్రభావిత వ్యక్తులు) ఉన్నట్లు ప్రాథమిక అంచనా.
విస్తరణ వివరాలు..
భూములు సేకరించే గ్రామాలు:
రామానుజవరం, తిర్లాపురం, మణుగూరు
కోల్పోతున్న పెద్ద చెరువులు: రాయల
కుంట, చింతకుంట, బుర్దన్‌వాయ్‌కుంట, మల్లంపాడు.
ప్రతిపాదిత సేకరణ భూమి..
తిర్లాపురం 359.34 ఎకరాలు
రామానుజవరం 356.16 ఎకరాలు
మణుగూరు కొమ్ముగూడెం 96.36 ఎకరాలు
అటవీ భూమి 58.51 హెక్టార్లు
మొత్తం 813 ఎకరాలు
సర్వే సమయంలో స్థానికంగా ఉండాలి
మణుగూరు ఓసీ విస్తరణలో అందించే పరిహారం విని గ్రామస్తులు ఆమోదం తెలిపారు. సర్వే జరిగే సమయంలో అన్ని పనులు పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో ఉండాలి. అవార్డులో తప్పులకు తావివ్వకుండా సర్వే సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా నిర్వాసితులకు నేరుగా ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. దళారులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దు.
–సుమ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్

ఓసీ విస్తరణ వైపు అడుగులు

ఓసీ విస్తరణ వైపు అడుగులు