
కంప్యూటర్ విద్యపై పట్టు సాధించాలి
మణుగూరు రూరల్ : విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్ విద్యపైనా పట్టు సాధించాలని డీఈఓ వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని బాపూజీనగర్ ఎంపీపీఎస్‌లో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ప్రయోగశాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేందుకు విద్య గొప్ప ఆయుధంలా పని చేస్తుందన్నారు. అనంతరం భవిత కేంద్రంలో రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, బోధన సామగ్రిని పరిశీలించారు. దివ్యాంగ పిల్లలకు చక్కని బోధన అందించాలని సమ్మిళిత విద్య రిసోర్స్ పర్సన్లకు సూచించారు. జిల్లాలోని 17 మండలాల్లో భవిత కేంద్రాలకు అనుమతులు మంజూరయ్యాయని, ఈ కేంద్రాల ద్వారా దివ్యాంగ పిల్లలకు చదువుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
14న నవోదయ ప్రారంభం..
కరకగూడెం: కరకగూడేనికి మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఈనెల 14న ప్రారంభించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. బుధవారం ఆయన కరకగూడెం జెడ్పీ పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే జవహర్ నవోదయ విద్యాలయం జిల్లాకు రావడం అదృష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీఎంఓ సైదులు, ఏఎంఓ నాగరాజశేఖర్, ఎంఈఓలు జి స్వర్ణజ్యోతి, వీరస్వామి, మంజుల, సాంబాయిగూడెం కాంప్లెక్స్ హెచ్‌ఎం ఎం.శ్రీలత, ఎమ్మార్పీలు ఎం. విష్ణు, పి. బాలరాజు, పి. రామకృష్ణ, కె. రాంబాబు, ఐ. బాలాజీ, ఐ. రమేష్, టి శ్రీకాంత్, పాఠశాల హెచ్‌ఎం బ్రహ్మయ్య, బి.విజయ, ఏఏపీసీ చైర్మన్ ఉత్తమకుమారి, సమ్మిళిత రిసోర్స్ పర్సన్లు నాగశ్రీ, శ్యామ్ పాల్గొన్నారు.
డీఈఓ వెంకటేశ్వరా చారి