
ఫైన్ కడితే.. లైన్ క్లియర్
2022లో సీతమ్మ సాగర్ నిర్మాణ పనులు ప్రారంభం
● అనుమతి లేకుండా పనులేంటని ఎన్‌జీటీ ఆగ్రహం ● తక్షణమే నిలిపేయడంతో పాటు రూ.53.41 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశం ● జరిమానా చెల్లింపునకే ప్రభుత్వం మొగ్గు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగు భూములకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు చేపట్టింది. ఈ క్రమంలో సీతమ్మ సాగర్ పేరుతో గోదావరిపై బరాజ్ నిర్మిస్తోంది. పర్యావరణ అనుమతుల కోసం 2018లో కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసింది. ఆ వెంటనే వివిధ ప్యాకేజీలుగా విభజించి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాకుండానే సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మిస్తున్నారని, గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయని భద్రాచలం ఏజెన్సీకి చెందిన కొందరు 2022 డిసెంబర్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), చైన్నె బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో పర్యావరణంతో పాటు అన్ని రకాల అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలంటూ 2023 ఏప్రిల్ 26న ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది.
డీపీఆర్‌కు లైన్ క్లియర్..
సీతమ్మసాగర్ బరాజ్ నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేయగా, మరోవైపు ఈ బరాజ్ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)కు కూడా అనుమతులు లేవు. దీంతో గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2024 ఆగస్టు నుంచి ప్రయత్నించగా ఈ ఏడాది ఏప్రిల్ 24 నాటికి డీపీఆర్‌కు ఎకనామిక్ ఫీజుబులిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం లభించాయి. ఇక పర్యావరణ, అటవీశాఖ అనుమతులు కూడా సాధిస్తే సాంకేతిక చిక్కులన్నీ తొలగిపోయినట్టే. అయితే ఈ పర్మిషన్లు రావాలంటే ముందుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి ఎదురైంది.
అప్పీల్‌పై యూటర్న్..
సీతారామకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత రూ. 53.41 కోట్ల జరిమానాపై అప్పీల్‌కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే అప్పీల్‌కు వెళ్లడం ద్వారా ఒనగూరే ప్రయోజనం కంటే విలువైన సమయం వృథా అవుతుందనే భావనతో ప్రభుత్వ పెద్దలు ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్‌జీటీ విధించిన జరిమానా చెల్లించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరితగతిన ఎన్‌జీటీకి జరిమానా చెల్లించి ఆ వెంటనే ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్‌లు సాధించడంపై సర్కారు దృష్టి సారించాల్సి ఉంది. ఈ పనులన్నీ రాబోయే రెండు, మూడు నెలల్లో జరిగితేనే, ఈ ఏడాది చివరి నాటికి బరాజ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవకాశం చిక్కుతుంది. లేదంటే మరో ఏడాది వృథా కానుంది. ఇప్పటికే బరాజ్ నిర్మాణ పనులు (జలవిద్యుత్ కేంద్రం మినహాయించి) దాదాపు 40 శాతం వరకు పూర్తయ్యాయి.