
వరదలతో అప్రమత్తంగా ఉండాలి
● సాగర్‌లో మరమ్మతుల నేపథ్యంలో ఎన్నెస్పీ ఆయకట్టుకు గోదావరి జలాలు ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సూపర్‌బజార్(కొత్తగూడెం): గోదావరి వరదల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజుతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాది క్రితం భద్రాచలం ఏజెన్సీలో బ్రిడ్జిలు ధ్వంసమైతే ఇప్పటివరకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని అధికారులను ప్ర శ్నించారు. పనులు చేపట్టకపోవడంతో వరదల వల్ల రాకపోకలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. గ్రా మాల్లో పారిశుద్ధ్య బాధ్యత పూర్తిగా పంచాయతీరాజ్ శాఖదేనని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. గోదావరికి వరదలు పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. నాగార్జున సాగర్‌లో మరమ్మతులు ఉండటంతో వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల్లోని సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు తరలిస్తున్నట్లు తెలిపారు. సాగర్ కెనాల్‌కు రెండు రోజుల్లో నీరు చేరుతుందని అన్నారు. రాబోయే సీజన్ వరకు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలు, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని తెలిపారు. జిల్లాలోని పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాలకు 25 వేల నుంచి 50 వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ విద్యాచందన, ఇతర అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్, బాబూరావు, వెంకటేశ్వరరావు, జయలక్ష్మి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.