
రైతులకు ‘యూరియా’ వెతలు
● కొరత, అంతకుమించి ప్రచారంతో ఆందోళన చెందుతున్న కర్షకులు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలతో మరింత అయోమయం ● పీఏసీఎస్ గోదాంల వద్ద బారులుదీరుతున్న రైతులు ● జిల్లాకు సరిపడా కోటా వచ్చిందంటున్న వ్యవసాయాధికారులు
బూర్గంపాడు: పంటల సాగు ప్రారంభంలోనే యూరియా కొరతతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనులు మానుకుని పీఏసీఎస్ గోదాంల వద్ద బారులుదీరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలతో అయోమయం చెందుతున్నారు. యూరియా కోటా పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి విన్నవించారు. ఆ మరునాడే తెలంగాణలో రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయాలని నడ్డా సూచించడంతో యూరియా కొరత నిజమేననే నిర్ధారణకు రైతులు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ డీలర్లకు యూరియా సరఫరాను బాగా తగ్గించడంతో పీఏసీఎస్ గోదాంల వద్ద క్యూ కడుతున్నారు.
సాగు పనులు ఊపందుకోవడంతో..
జిల్లాలో ఇప్పటికే 90 శాతం మేర పత్తి విత్తనాలు నాటారు. వరినాట్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. సాగు పనులు ఊపందుకోవటంతో రైతులు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. యూరియా సరఫరా కూడా జిల్లాకు రావాల్సిన కోటాకు తక్కువగా వస్తుండటంతో రైతులు కలవరపడుతున్నారు. రసాయనిక ఎరువుల్లో తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు యూరియా వినియోగాన్ని బాగా పెంచారు. యూరియా వినియోగంతో పంటలకు చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నా రైతులు పెట్టుబడి వ్యయం దృష్టిలో ఉంచుకుని యూరి యానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభు త్వ రాయితీపోను 45 కిలోల యూరియా బస్తా రూ.267కు దొరుకుతుంది. అదే కాంప్లెక్స్ ఎరువులైన డీఏపీ, 20:20:0:13లు బస్తా రూ.1400కు చేరింది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తా రూ.1,750 నుంచి రూ.1800 వరకు ఉన్నాయి. కాంప్లెక్స్ ఎరువులకు ఎక్కువ ధరలు పెట్టలేక యూరియా వినియోగిస్తున్నారు. జూన్, జూలై నెలలకు కలిపి జిల్లాకు 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఆ మేరకు సరఫరా అయిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కోటా సరిపడా వస్తే రైతులు గోదాంల వద్ద ఎందుకు బారులుదీరుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన కోటా రాలేదని, అప్పుడు వినియోగించుకోవాల్సిన రైతులు జూన్ మొదటివారంలో వినియోగించుకున్నారని, ఈ క్రమంలో కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
గోదాంల వద్ద బారులు
యూరియా కోసం రైతులు ఒకేసారి అధిక సంఖ్య లో వస్తుండటంతో పీఏసీఎస్ ఎరువుల గోదాంల వద్ద గొడవలు జరుగుతున్నాయి. పీఏసీఎస్‌లకు వస్తున్న రెండు, మూడు లారీల కోసం వందలాదిమంది క్యూ కడుతున్నారు. వీరిలో సగం మందికి కూడా యూరియా అందడంలేదు. దీంతో విక్రయాలు పీఏసీఎస్ సిబ్బందికి తలనొప్పిగా మారాయి. దీంతో ఆధార్‌కార్డ్‌కు ఒకట్రెండు యూరియా బస్తాలు ఇవ్వటం ప్రారంభించారు. పంటలు సాగు చేయని వారి ఆధార్‌కార్డులు కూడా వస్తుండటంతో యూరియా ఎటూ సరిపోవటం లేదు. ఈ నేపథ్యంలో మూడురోజులుగా పట్టాదా రు పాస్ పుస్తకాలు, ఆధార్‌కార్డుల జిరాక్స్‌లు ఆధారంగా ఎకరాకు ఒక యూరియా బస్తా ఇస్తున్నారు. జూలై, ఆగస్ట్ నెలల్లో పంటలకు ఎరువుల విని యోగం మరింతగా పెరగనుంది. ఈ పరిస్థితుల్లో యూరియా సరిపడా అందుబాటులోకి వస్తుందా లేదా అనేది వేచిచూడాలి. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మాత్రం యూరియా కొరత ఉండదని, రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించుకోవా లని సూచిస్తున్నారు.
వేచి చూస్తున్నాం..
ఈ ఏడాది యూరియాకి ఇబ్బందిగానే ఉంది. ఒక రోజు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ ఇచ్చి రావాలి. లోడ్ వచ్చిన రోజు వెళ్లి సీరియల్ కోసం వేచిచూడాలి. ఈలోపు వచ్చినా యూరియా అయిపోతే మళ్లీ లోడ్ వచ్చేవరకు ఎదురుచూడాలి. – నిమ్మల రాములు,
రైతు, నాగినేనిప్రోలు, బూర్గంపాడు మండలం
యూరియా దొరకటం లేదు
ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. తొలివిడత ఎరువు వేద్దామంటే యూరియా దొరకటం లేదు. మూడురోజులుగా పీఏసీఎస్ గోదాంకు తిరుగుతున్న ఎకరాకు బస్తా ఇస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు అడుగుతున్నారు.
– సాంబశివరావు, రైతు, పెద్దతోగు,
గుండాల మండలం

రైతులకు ‘యూరియా’ వెతలు

రైతులకు ‘యూరియా’ వెతలు