
మేల్కొనేదెలా..?
ముందస్తుగా
ఆధునికీకరణ తప్పనిసరి
1987లో రూపొందించిన ఫ్లడ్ మ్యానువల్‌ను ఆధునికీకరించాలని ముంపు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 2022 వరదల నుంచి మరింతగా డిమాండ్ చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనం లేదు. వరదలు సంభవించిన సమయంలో హడావుడి చేస్తూ ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, దేవస్థాన తదితర శాఖల అధికారులు ఉమ్మడిగా కసరత్తు చేసి ఫ్లడ్ మ్యానువల్‌ను రూపొందించాల్సి ఉంది. గతంలో వరదల సమయంలో పని చేసిన సీనియర్ అధికారులు, సిబ్బంది సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల భద్రాచలం పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే గోదావరి వరదల గరిష్ట స్థాయి అంచనాలతో పటిష్ట ప్రణాళిక రూపొందించాలి. దీనివల్ల వరద నష్టనివారణ చర్యలు పకడ్బందీగా చేపట్టే అవకాశం ఉంటుంది.
భద్రాచలం: ఏటా వర్షాకాలంలో భద్రాచలం ఏజెన్సీ ప్రజలకు గోదావరి వరదలు వణుకు పుట్టిస్తున్నాయి. జనావాసాలు, పంట చేలు నీటమునుగుతున్నాయి. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికకు సంబంధించి అధికారులు పాత ఫ్లడ్ మ్యానువల్‌నే అనుసరిస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌తో ముంపు ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వరద సమస్యలను ఎదుర్కొనేందుకు ఫ్లడ్ మ్యానువల్‌ను ఆధునికీకరించాల్సి ఉంది.
1984లో రూపకల్పన..
భద్రాచలం ఏజెన్సీని ఏటా గోదావరి వరదలు ముంచెత్తుతాయి. వరద నీటిమట్టం ఎన్ని అడుగులకు చేరుకుంటే ఏయే ప్రాంతాలు ముంపునకు గురవుతాయి? ఏయే గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలి? పంట చేలు ఏ మేరకు దెబ్బతింటాయి? తదితర వివరాలు, ముందస్తు జాగ్రత్తలను పొందుపరుస్తూ 1984లో తొలిసారిగా ఫ్లడ్ మ్యానువల్ రూపొందించారు. దీని ప్రకారం అధికారులు ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. కాగా 1986 ఆగస్టు 16న గోదావరి వరద అత్యధికంగా 75.6 అడుగులుగా నమోదయింది. దీంతో 1987లో, అనంతరం 2007లో మరోసారి ఫ్లడ్ మ్యానువల్‌లో మార్పులు చేశారు. అదే మ్యానువల్‌ను అధికారులు ఇప్పటికీ మార్గదర్శనిగా ఉపయోగిస్తున్నారు.
పోలవరం నిర్మాణంతో పెరుగుతున్న ముంపు
ఏపీలో గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో వరద ముంపు తీవ్రత అధికమవుతోంది. వరద నుంచి రక్షణకు నిర్మించిన కరకట్టకు ఇవతలి వైపున ఉన్న దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలంలో వరద ముంపు పెరిగింది. నదికి అవతలివైపు ఉన్న బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పొలాలు నీట మునుగుతున్నాయి. 2022 జూలై 16న గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చగా, వరద 71.6 అడుగులుగా నమోదయింది. వేలాది ఎకరాల పంటలు నీటి మునిగాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తొలిసారిగా బూర్గంపాడు, పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో ముంపు తీవ్రత అధికమైంది. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ వల్లే ముంపు తీవ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికల స్థాయిలో స్థిరమైన వరద ప్రవాహం కొద్ది రోజులపాటు కొనసాగుతుండటం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
40 ఏళ్ల క్రితం రూపొందించిన ఫ్లడ్ మ్యానువలే అనుసరణ
2022 వరదల తర్వాత నుంచి ముంపు బాధితుల్లో ఆందోళన
పోలవరం ప్రాజెక్ట్‌తో ఏటేటా పెరుగుతున్న ముంపు తీవ్రత
ప్రస్తుత పరిస్థితికి తగినట్టు మ్యానువల్ ఆధునికీకరణ తప్పనిసరి

మేల్కొనేదెలా..?