
మునగ తోట.. లాభాల బాట
● పత్తి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేయండి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్
టేకులపల్లి : మునగ తోటలు సాగు చేసి లాభాల బాట పట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. మండలంలోని రాంపురం పంచాయతీ పాతతండాలో సాగు చేసిన మునగ తోటను మంగళవారం ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు గాంధీని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆసక్తి గల రైతులంతా మునగ సాగు చేయాలని సూచించారు. పత్తి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా కూడా సాగు చేయొచ్చని చెప్పారు. మునగ కాయలు, ఆకులతో పాటు ఎండిన విత్తనాలతో కూడా అధిక ఆదాయం వస్తుందని వివరించారు. రైతులు బయోచార్ కోల్ తయారు చేసుకోవాలని, అందుబాటులో ఉన్న కలపను ‘వి’ ఆకారంలో తీసిన గొయ్యిలో వేసి కాల్చాలని, తద్వారా వచ్చిన బొగ్గును గో మూత్రంలో కలిపి ఎరువుగా వినియోగించాలని సూచించారు. ఇళ్లలో నీరు నిల్వ ఉన్న చోట ఇంకుడు గుంతలు నిర్మించేలా చూడాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ బి.మల్లేశ్వరి, ఎంపీఓ జక్కుల గణేష్ గాంధీ, ఏఓ అన్నపూర్ణ, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం రవికుమార్, ఈసీ తిరుపతయ్య, కార్యదర్శి రాజశేఖర్, సీసీలు శ్రీలత, సునీల్, టీఏ సురేష్, ఎఫ్‌ఏ సాగర్, ఏఈవో భాగ్యశ్రీ పాల్గొన్నారు.
పిల్లల సంరక్షణ అందరి బాధ్యత..
సూపర్‌బజార్(కొత్తగూడెం): పిల్లల సంరక్షణ అందరి భాధ్యత అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా బాలల సంరక్షణ యూనిట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మిక రహిత జిల్లాగా మార్చేందుకు కోళ్లఫామ్‌లు, ఇటుక బట్టీలు, షాపింగ్ మాళ్ల వంటి చోట తనిఖీలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎన్ని పోక్సో కేసులు నమోదయ్యాయో నివేదిక అంజేయాలని ఆదేశించారు. చైల్డ్ హెల్ప్ లైన్ కు వచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలన్నారు. అనంతరం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 వాల్‌పోసర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీడబ్ల్యూఓ లెనీనా, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఐటీ కోర్ సీఐ రాము పాల్గొన్నారు. కాగా, ఈనెల 9, 10 తేదీల్లో కలెక్టరేట్‌లో నిర్వహించే మెగా ఆధార్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.