
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పులికాదు.. తోడేలు !
పాదముద్రలు సేకరించిన
అటవీ అధికారులు
పాల్వంచరూరల్ : పాండురంగాపురం – నర్సంపేట పరిసరాల్లో పెద్దపులి సంచారం ఉదంతం వైరల్ కావడంతో పాల్వంచ అటవీ శాఖ రేంజర్ సురేష్, డీఆర్‌ఓ సిబ్బందితో కలిసి సోమవారం పాండురంగాపురం నుంచి ఉప్పుసాక మార్గంలో పరిశీలించారు. అక్కడ లభించిన పాదముద్రలు నక్క లేదా తోడేలుకు సంబంధించినవని గుర్తించారు. పులి పాదముద్ర అయితే 10 సెం.మీ.వెడల్పు, 14 సెం.మీ. పొడవు ఉంటుందని, ఇక్కడున్న పాదముద్రలు 6 సెం.మీ. వెడల్పు, 7 సెం.మీ.పొడవు మాత్రమే ఉన్నాయని వివరించారు. పరిసర ప్రాంత రైతులు, ప్రజలు కూడా పులి ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారని, పులి సంచారం ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని రేంజర్ సూచించారు.
మహిళలంతా ఎస్‌హెచ్‌జీలో సభ్యులుగా ఉండాలి
డీఆర్డీఓ విద్యాచందన
చుంచుపల్లి: జిల్లాలోని ప్రతీ మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలిగా ఉండాలని, అవసరమైతే కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని డీఆర్‌డీఓ ఎం.విద్యాచందన సెర్ప్ సిబ్బందికి సూచించారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్త సంఘాల్లో బాలికలు, వృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతి, 2025 – 26 భవిష్యత్ ప్రణాళికను వివరించారు. బ్యాంకు లింకేజీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 101 శాతం ప్రగతి సాధించామని, ఈ ఏడాదిలో 100 శాతం ప్రగతి సాధించాలని అన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాలను ప్రతీ మహిళ వినియోగించుకోవాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకు స్కూల్ యూనిఫామ్ తయారీ చార్జీలు మొత్తం రూ. 97,98,058 మంజూరయ్యాయని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు జిల్లాలో 9 బస్సులు కేటాయించామని, ఒక్కో బస్సును రూ.36 లక్షల చొప్పున మండల సమాఖ్య ద్వారా కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చామని తెలిపారు. సమావేశంలో అదనపు డీఆర్‌డీఓ (సెర్ప్) నీలేష్ పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న ఎప్‌సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు చేపట్టిన కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో గత వారం రోజులుగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఈ కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుందని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ చందా సుధాకర్ తెలిపారు. కాగా, సోమవారం 800 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 760మంది హాజరయ్యారని వెల్లడించారు.

రామయ్యకు ముత్తంగి అలంకరణ

రామయ్యకు ముత్తంగి అలంకరణ