ఎవరూ నిరాశ చెందొద్దు | - | Sakshi
Sakshi News home page

ఎవరూ నిరాశ చెందొద్దు

Jul 7 2025 6:23 AM | Updated on Jul 7 2025 6:23 AM

ఎవరూ నిరాశ చెందొద్దు

ఎవరూ నిరాశ చెందొద్దు

కొత్తగూడెంఅర్బన్‌: భవిష్యత్‌లో గుడి లేని గ్రామం ఉంటుందేమో కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉండదని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడతలో ఇళ్లు రానివారు నిరాశకు గురి కావొద్దని, రెండో విడతలో మంజూరు చేస్తామని తెలిపారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, పాల్వంచ, చుంచుపల్లి మండలాల లబ్ధిదారులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులతో కలిసి ఆయన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఎస్‌ఆర్‌టీ నగర్‌, మాయాబజార్‌ ప్రాంతాల నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం, చింతపెంటిగూడెంలో హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిఏకాదశి రోజున ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు.

ప్రతీ సోమవారం ఖాతాల్లో నగదు..

మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామని, ఇందులో రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం వడివడిగా సాగుతోందని అన్నారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు, రూ. 500కే వంట గ్యాస్‌, రేషన్‌ కార్డుల పంపిణీ, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, నాలుగు రోజుల క్రితమే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా అందించామని వివరించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, కొందరు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి గుండు సున్న ఖాయమని స్పష్టం చేశారు.

పదేళ్లలో రూ. 8.19 లక్షల కోట్ల అప్పు

రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ 8 లక్షల 19 వేల కోట్ల రూపాలయ అప్పు చేసిందని మంత్రి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ మువ్వా విజయబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రామవరంలో భూములకు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం కల్పించాలని కోరారు. కొత్తగూడెంలో జర్నలిస్టులకు బీపీఎల్‌ కోటాలో స్థలాలు మంజూరు చేయాలని అన్నారు. కొత్తగూడెం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల ప్రక్రియను హోల్డ్‌లో పెట్టారని, దానిని ఎత్తివేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ సౌరభ్‌శర్మ, అదనపు కలెక్టర్‌ విద్యాచందన, నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, మండే వీరహనుమంతరావు, రజాక్‌, ఆళ్ల మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాబోయే విడతల్లో మిగిలినవారికి

ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా ఖాయం

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ

మంత్రి పొంగులేటి

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల

మంజూరు పత్రాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement