
లింక్ పంపి.. డబ్బులు చోరీ..
రఘునాథపాలెం: స్మార్ట్‌ఫోన్‌ను ప్రతీ ఒక్కరు విరవిగా వాడుతున్నారు. బ్యాంకింగ్ సేవలు, పేమెంట్ యాప్స్ వాడకం ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రజలు కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే, అమాయక ప్రజలు సైబర్ మోసాల బారినపడుతున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు తప్పుడు యాప్స్, గిఫ్ట్ లింకులు, ఫేక్ కాల్స్ ద్వారా వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరాల్లోనే కాక, రూరల్ ప్రాంతాల్లోనూ మొబైల్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే వంటివి విస్తృతంగా వాడకంలో ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు మొబైల్‌కు సందేశాల రూపంలో ‘గిఫ్ట్ లభించింది‘, ‘మీకు లాటరీ వచ్చింది‘, లేదా ‘వివరాలు అప్‌డేట్ చేయాలి‘ అంటూ తప్పుడు లింకులు పంపుతున్నారు. అమాయకులు వాటిని ఓపెన్ చేస్తే, వారి ఫోన్ హ్యాకింగ్‌కు గురై ఖాతాల్లోని డబ్బులు మాయమవుతున్నాయి. రఘునాథపాలెం మండలంలో ఒక్క వారం వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు నష్టపోయారు. ఇక పరువు పోతుందని భావించి చాలామంది మోసపోయిన విషయాన్ని బయటపెట్టడంలేదు. కాగా, సైబర్ మోసగాళ్లు మరో పంథాను ఎంచుకుంటున్నారు. ‘మీ పిల్లలు కేసులో ఇరుక్కున్నారు.. డబ్బులు పంపించకపోతే అరెస్ట్ చేస్తాం’ అంటూ వాట్సాప్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ తరహా మోసాలతో భయపడిన కొన్ని కుటుంబాలు డబ్బులు పంపించిన ఘటనలు ఉన్నాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ‘ఏ సందేశమైనా, యాప్ అయినా డౌన్‌లోడ్ చేసేముందు తాను ఎవరితో డీలింగ్ చేస్తున్నానో తెలుసుకోవాలి. ఎవరికై నా డబ్బులు పంపేముందు నమ్మదగిన వ్యక్తుల దగ్గర సలహా తీసుకోవాలి’ అని అధికారులు సూచిస్తున్నారు. సక్రమమైన బ్యాంకింగ్ యాప్‌ల ద్వారామాత్రమే లావాదేవీలు చేయాలని, గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రామీణ ప్రజలను టార్గెట్ చేస్తున్న
సైబర్ మోసగాళ్లు
అప్రమత్తంగా ఉండాలి..
ప్రతీ ఒక్కరు సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత మేర తెలిసిన వారి ద్వారానే యాప్‌ల ద్వారా లావాదేవీలు సాగించాలి. వచ్చిన ప్రతి మేసేజ్‌లను క్లిక్ చేయకుండా తెలియక పోతే తెలిసిన వారికి చూపించిన తర్వాతనే ముందుకు సాగాలి. సైబర్ మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించి బ్యాంక్ లావాదేవీలను ఆపించాలి. కొత్త వ్యక్తులు పంపే లింక్‌లను ఓపెన్ చేయొద్దు. ఓటీపీలను చెప్పేముందు ఒకటికి రెండు సార్లు ఆరా తీయాలి.
– ఉస్మాన్‌షరీఫ్, సీఐ రఘునాథపాలెం

లింక్ పంపి.. డబ్బులు చోరీ..