
నర్సరీ యజమానులకు అవగాహన సదస్సు
సూపర్‌బజార్(కొత్తగూడెం): మిరప, కూరగాయల నారు పెంచే నర్సరీ యజమానులకు మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి జంగా కిశోర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నర్సరీల్లో పలు పంటలకు చెందిన నారు 29.4 కోట్ల మేర ఉత్పత్తి జరుగుతోందని, జిల్లాలో మిరప 17,589 ఎకరాల్లో సాగు చేస్తున్నారని, సుమారు రెండు వేల కేజీల మిరప విత్తనం నుంచి 20 కోట్ల మిరపనారు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. నర్సరీలన్నీ కొత్త నర్సరీ నియంత్రణ నియమావళి–2017 ప్రకారం నాణ్యమైన, ప్రాచుర్యంలో ఉండి పేరెన్నిక గల అధిక దిగుబడినిచ్చే రకాలను పెంచి రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. సదస్సులో ఉద్యాన అధికారులు జి.దేవప్రసాద్, కె.మీనాక్షి, ఎం.స్రవంతి, బి.స్రవంతి, సీహెచ్ సాయికృష్ణ, జిల్లాలోని వివిధ నర్సరీల యజమానులు పాల్గొన్నారు.