రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు
ఎన్‌సీసీ పరీక్షలో
నూరుశాతం ఉత్తీర్ణత
అశ్వారావుపేటరూరల్: మండలంలోని పెదవాగు ప్రాజెక్ట్ గ్రామంలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల(దమ్మపేట)లోఎన్‌సీసీ పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కళాశాలలో 33 మంది విద్యార్థినులు ఉండగా, జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో అందరూ ఉత్తీర్ణత పొందారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ వి. స్పందన గురువారం వివరాలు వెల్లడించారు. కొణిజర్ల కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులకు ఖమ్మం బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ భద్ర చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌తోపాటు వైస్ ప్రిన్సిపాల్ కె.సింధు శ్రీ, సీటీఓ ఆఫీసర్ ఎం.అరుణ, సిబ్బంది భువన, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
వెంకన్న సన్నిధిలో
పాలకుర్తి ఎమ్మెల్యే పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డితో కలిసి గురువారం దర్శించుకున్నారు. శ్రీవారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ అందజేశారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన


