ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాం
దమ్మపేట: విశ్వవిఖ్యాత నటుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దమ్మపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ చేతుల మీదుగా తయారైన నాయకులే నేడు పలు పార్టీల్లో కొనసాగుతున్నారని తెలిపారు. ఒక్క తెలంగాణలోనే కాక దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానిస్తే తాను వెళ్తానని స్పష్టం చేశారు. సొంత పార్టీ వ్యక్తులు, బయట పార్టీ వ్యక్తులు ఎన్ని ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించినా తాను ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. సీతారామ ప్రాజెక్టు జలాలను ప్రస్తుత సంవత్సరం సత్తుపల్లి నియోజకవర్గానికి, రాబోయే సంవత్సరం నాటికి అశ్వారావుపేట నియోజకవర్గానికి తీసుకొస్తానని వివరించారు. పెదవాగు, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహిస్తామని చెప్పారు. అంతకుముందు మండలంలోని గండుగులపల్లిలో తన పామాయిల్ క్షేత్రంలో ఫార్మ్ రోబో సంస్థ రూపొందించి కలుపు తీసే యంత్రాన్ని పరిశీలించారు. ఆయిల్ ఫెడ్ అనుబంధ శాస్త్రవేత్త కిరణ్ కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, తెలుగుదేశం సార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కట్రం స్వామి దొర, వలీపాషా, అలపాటి ప్రసాద్, కొయ్యల అచ్యుతరావు, రావు గంగాధరరావు, పైడి వెంకటేశ్వరరావు, దారా మల్లికార్జునరావు, పగడాల రాంబాబు, కొండపల్లి కృష్ణమూర్తి, కే.వి.సత్యనారాయణ, ఎర్రా వసంతరావు, నల్లగుళ్ల కిరణ్, గడ్డిపాటి సత్యం పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల


