
క్రీడలతో ఆనందం, ఆరోగ్యం
సుజాతనగర్: క్రీడలతో ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. వేపలగడ్డలో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా బ్యాడ్మింటన్ ఆటపై మక్కువ పెరుగుతుందని అన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధనే ముఖ్యమని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, స్టేడియం నిర్వాహకులు చెరుకుమల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.