
‘పచ్చిరొట్ట’పై పునరాలోచన!
గతేడాది రూ.1,116..
ఈ ఏడాది రూ.2,137
గతేడాది 30 కిలోల జీలుగు విత్తనాల బస్తా ధర ప్రభుత్వ రాయితీ పోగా రూ.1,116 ఉండగా, ఈ ఏడాది ఆ ధర రూ. 2,137.50కు పెరిగింది. గతేడాది కిలో జీలుగుల ధర రూ.93 ఉండగా, ప్రభుత్వం రూ.55.80 సబ్సిడీ ఇవ్వగా రైతులు రూ. 37.20 చెల్లించారు. ఈ ఏడాది కిలో జీలుగు ధర రూ.142.50కు పెరిగింది. ఇందులో ప్రభుత్వ రాయితీ రూ 71.25 పోగా రైతులు కూడా రూ.71.25 చెల్లించాలి. గతేడాది పోల్చితే ధర రూ.34 పెరిగింది. 30 కిలోల జీలుగు బస్తాకు రూ.1,020 అదనంగా పెరిగినట్లయింది. గతేడాది ప్రభుత్వం 60శాతం రాయితీ ఇవ్వగా ఈ ఏడాది రాయితీని 10 శాతం తగ్గించి 50శాతానికి కుదించింది.
బూర్గంపాడు: పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ విధానాలను అవలంబించేందుకు ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాల సాగును ప్రోత్సహిస్తోంది. జిల్లాలో రైతులు మాగాణి భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పచ్చిరొట్ట విత్తన ధరలను ప్రభుత్వం అమాంతం పెంచింది. గతేడాదితో పోలిస్తే రేటు రెట్టింపయింది. గతంలో 60 శాతం మేర ఉన్న రాయితీని 50 శాతానికి తగ్గించింది. విత్తన ధర పెంపు, సబ్సిడీ తగ్గింపుతో రైతులపై ఆర్థికభారం పెరిగింది.
జీలుగు వినియోగమే ఎక్కువ
జిల్లాలో ఏటా రైతులు పచ్చిరొట్ట సాగుకు ఎక్కువగా జీలుగులనే వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల జనుము సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పీఏసీఎస్‌ల ద్వారా జీలుగు విత్తనాలను సరఫరా చేయనుండగా, ఈ ఏడాది జిల్లాకు 5 వేల క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. గతేడాది సుమారు 6 వేల క్వింటాళ్లకు పైగా రైతులకు అందించారు. విత్తనాల రాశి తగ్గడం, ధర పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 30 కిలోల సంచి రెండు ఎకరాల సాగుకు సరిపోనుండగా, ఒక ఎకర సాగుకు రూ.1,100 వరకు ఖర్చవుతుంది. దుక్కికి మరో రూ.2 వేలు ఖర్చు చేయాలి. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేయాలా? వద్దా అని రైతులు ఆలోచిస్తున్నారు.
విత్తన ధర పెంపు, రాయితీ తగ్గింపుతో రైతుల ఆందోళన
30 కేజీల జీలుగు బస్తా కొనాలంటే రూ.1,020 అదనపుభారం
భూసారం కోసం
పచ్చిరొట్ట సాగు చేయాలన్నా కష్టమే..
ఐదు వేల క్వింటాళ్లు సిద్ధం
జిల్లాలో ఐదు వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధంగా ఉంచాం. మండల వ్యవసాయశాఖ అధికారుల రికై ్వర్‌మెంట్ ప్రకారం ఇంకా విత్తనాలు తెప్పిస్తాం. రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసి భూసారాన్ని పరిరక్షించుకోవాలి.
–బాబూరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
రాయితీ పెంచి ధర తగ్గించాలి
జీలుగు విత్తనాల ధరలు రెట్టింపు చేయటం రైతులకు ఇబ్బందే. ఽవిత్తన ధరలు పెరిగితే ప్రభుత్వం రాయితీ పెంచాలి. అట్లకాకుండా ధరలు పెరిగినప్పుడు, రాయితీ తగ్గించటం సరికాదు. ఇప్పటికై నా రాయితీ పెంచి ధర తగ్గించాలి.
–ఊడుగుల సత్యం, రైతు, గొమ్మూరు

‘పచ్చిరొట్ట’పై పునరాలోచన!

‘పచ్చిరొట్ట’పై పునరాలోచన!