
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్ష, మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండో సంవత్సరం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 కేంద్రాల్లో మొదటి సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సు విద్యార్థులు 1,359 మందికి 1,217 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 188 మందికి 163 హాజరయ్యారు. రెండు విభాగాల్లో 113 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి జనరల్ కోర్సు 432 మందికి 404 మంది విద్యార్థులు హాజరు కాగా, 28 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 64 మందికి 54 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దీంతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు, ఆశలు మెడికల్ కిట్లతో విధులు నిర్వహించారు. కొత్తగూడెంలో కొన్ని కేంద్రాల పేర్లు సరిగ్గా తెలియక కొందరు విద్యార్థులు మరో కేంద్రానికి వెళ్లి.. చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులు తీశారు.