
భాగ్యరెడ్డివర్మ చిరస్మరణీయుడు
సూపర్‌బజార్(కొత్తగూడెం): దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త ఎంవీ భాగ్యరెడ్డివర్మ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కొనియాడారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో భాగ్యరెడ్డివర్మ 137వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ కేంద్రంగా దళిత పాఠశాలలు స్థాపించారని, బాల్యవివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించారని పేర్కొన్నారు. మద్యపాన నిషేధం, గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి అనసూర్య, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఏఓ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రహదారుల వెంట
ఇంకుడు గుంతలు నిర్మించాలి
రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. జల్ సంచయ్ జన్‌భాగీ దారి కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీరు నేలలోకి ఇంకి భూగర్భజల మట్టం పెరుగుతుందని అన్నారు. రోడ్ల పక్కన వర్షపునీరు నిలిచేందుకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇంకుడు గుంతలు తవ్వించాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో చుక్క వర్షపు నీరు కూడా వృథా కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలో జిల్లా ద్వితీయస్థానంలో ఉందని, అధిక సంఖ్యలో నిర్మాణాలు చేపట్టి ప్రథమస్థానంలో నిలపాలని సూచించారు.
26 నుంచి శిక్షణ తరగతులు
చుంచుపల్లి: లైసెన్స్‌డ్ సర్వేయర్ అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి జూలై 26 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మైనింగ్ కళాశాలలో శిక్షణ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. 426 మంది అభ్యర్థులకు 50 పని దినాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉదయం 9 గంటలకు క్షేత్రస్థాయిలో శిక్షణ, 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు థియరీ, ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. శిక్షణ కోసం అవసరమైన ప్రొజెక్టర్లు, బోర్డులు తదితర అన్ని పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకమని, అభ్యర్థులకు చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ డి.శ్రీనివాస్, మైనింగ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.