
ఘనంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం స్వామివారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
ఇద్దరు అర్చకులకు
నోటీసులు జారీ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధానార్చకులకు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి గురువారం నోటీసులు జారీ చేశారు. రామాలయంలోని అభయాంజనేయ స్వామివారికి హనుమాన్ జయంతి సందర్భంగా తమలపాకార్చనను నిర్వహించడంలో అర్చకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ప్రధానార్చకులు విష్ణు, కిరణ్ కుమారాచార్యులును వివరణ కోరగా తమలపాకార్చన నిర్వహించలేదని సమాధానం చెప్పారు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారికి నోటీసులు జారీ చేశారు.
సింగిల్‌విండోలో హెచ్‌టీ సర్వీసుల మంజూరు
విద్యుత్ ఎస్‌ఈ మహేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): వినియోగదారులకు హెచ్‌టీ 11 కేవీ, 33 కేవీలతోపాటు అంతకంటే ఎక్కువ ఓల్టేజీ సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు విద్యుత్ ఎస్‌ఈ జి.మహేందర్ తెలిపారు. ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించారు. సర్కిల్ కార్యాలయంలో హెచ్‌టీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సింగిల్ విండో విధానంతో వినియోగదారులు టీజీ ఎన్‌పీడీసీఎల్ పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో హెచ్‌టీ దరఖాస్తులు (టీజీ ఐపాస్‌లో నమోదుకాని) నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత కొత్త అప్లికేషన్ నంబరు వస్తుందని వివరించారు. విద్యుత్ సిబ్బంది ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్‌ను సందర్శిస్తారని తెలిపారు. లోపాలుంటే రెండురోజులలోపు రిమార్క్ వివరాలను వినియోగదారునికి ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
భాస్కర్‌నాయక్
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్‌నాయక్ సూచించారు. మండలంలోని ఎర్రగుంట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి మాట్లాడారు. శస్త్రచికిత్సలు లేకుండా సహజ ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని కోరారు. తమకు ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని 104 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేయగా, తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ తన్మయ్, ఆరోగ్య సిబ్బంది ఎస్తేరు రాణి, ప్రకాష్‌రావు, హారిక, ప్రసాదరావు, కళ్యాణ్, లక్ష్మి, శరత్ పాల్గొన్నారు.

ఘనంగా రామయ్య కల్యాణం