‘ఏసీబీ’తో భయం.. భయం | - | Sakshi
Sakshi News home page

‘ఏసీబీ’తో భయం.. భయం

May 23 2025 2:03 AM | Updated on May 23 2025 2:03 AM

‘ఏసీబీ’తో భయం.. భయం

‘ఏసీబీ’తో భయం.. భయం

● సింగరేణిలో తొలిసారిగా చిక్కిన కార్మికుడు ● మిగతావారిపై ఆరా తీస్తున్న అధికారులు ● లోతుగా విచారిస్తే మరింతమంది వెలుగులోకి.. ● మున్సిపాలిటీల్లో కూడా పెరిగిపోతున్న అవినీతి ఆరోపణలు

కొత్తగూడెంఅర్బన్‌: అత్యాశ, ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కి జైలుపాలవుతున్నారు. కొందరు లంచం తీసుకుంటుండగా, మరికొందరు అవినీతి ఆరోపణలకు గురై సాక్ష్యాధారాలతో దొరుకుతుండటంతో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేస్తున్నారు. జిల్లాలో గడిచిన 16 నెలల కాలంలో ఏసీబీ అధికారులు 19 కేసులు నమోదు చేశారు. 27 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం జిల్లాలో లంచం అడగాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు వణుకు పుడుతుందనే చెప్పుకోవచ్చు. కానీ సింగరేణి, మున్సిపాలిటీల్లో అవినీతి పెచ్చుమీరుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో ఈ నెల 6న ఏసీబీ దాడులు నిర్వహించింది. వర్క్‌షాపులో డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి దగ్గర రూ.50 లక్షలు, 100 ఫైళ్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు కార్మికుడి ఇంట్లో సోదాలు చేసి ఆధారాలతో సహా పట్టుకుని కేసు నమోదు చేశారు. సింగరేణిలో మొదటిసారి దాడులు నిర్వహించిన సమయంలో సింగరేణి ఆస్పత్రిలో హడావిడి చేశారుకానీ నిందితులను పట్టుకోలేకపోయారు. రెండోసారి దాడుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశారు. కార్మికుల బదిలీలు, మెడికల్‌ అనిఫిట్‌లు, ఇతర సమస్యల పరిష్కారానికి లంచం తీసుకుంటున్నవారు ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. వివరాలన్నీ సేకరించే పనిలో ఉన్న వారు మరోసారి దాడులు చేస్తే ఏళ్ల తరబడిగా దందాలు చేస్తున్న వారు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొంతకాలంగా సింగరేణి ఆస్పత్రి సమీపంలోని హోటళ్లను అడ్డాగా చేసుకుని కొందరు బదిలీలు, మెడికల్‌ అన్‌ఫిట్‌ దందాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి అడ్డాలు జిల్లా కేంద్రంలో అనేకం ఉన్నాయని, పక్కా సమాచారంతో దాడులు చేస్తే అక్రమార్కులకు చెక్‌ పెట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు. కొందరు కార్మిక సంఘ నాయకులు కూడా దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సింగరేణి విజిలెన్స్‌ దాడులు చేస్తే మేలు

సింగరేణి మెడికల్‌ బోర్డులో అన్‌ఫిట్‌ చేయిస్తామని, బదిలీ చేయిస్తామని, ఉద్యోగాలకు ఎంపికై న వారిని వైద్య పరీక్షల్లో ఫిట్‌ చేయిస్తామని ఎవరైనా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సింగరేణి అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ ఆచరణలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో దందా యథాతథంగా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కార్మికుల బదిలీలు, అన్‌ఫిట్‌ తదితర విషయాల్లో లంచం తీసుకునేవారి వివరాలతో సింగరేణి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తే రూ.10 వేలు పారితోషికం అందజేస్తామని రెండు వారాల కిందట అధికారులు ప్రకటించారు. దందా యథేచ్ఛగా సాగుతున్నా ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఆధారాలు ఉన్న కూడా తమ పనులు పూర్తయితే చాలు అనుకునే వారు వందల సంఖ్యలో ఉన్నారు. విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయిస్తే వారి పనితోపాటు, వారు కూడా బయటపడే అవకాశం ఉందని కొందరు జంకుతున్నారు. అయితే విజిలెన్స్‌ అధికారులే అడ్డాలపై దృష్టి సారించి దాడులు చేస్తే అవినీతిపరులు దొరుకుతారని పలువురు పేర్కొంటున్నారు.

మున్సిపాలిటీలో ఇద్దరితో బోణీ...

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు ఉండగా, పాల్వంచ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌లో సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ ఇద్దరూ ఏసీబీకి పట్టుబడ్డారు. మిగతా మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తే మున్సిపాలిటీల్లోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది చిక్కే అవకాశముంటుంది. ప్రస్తుతం కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేట మూడు మున్సిపాలిటీలకు కూడా ఒక్కరే కమిషనర్‌ ఉండటంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో ఏసీబీ నిఘా పెడితే అవినీతిపరులకు చెక్‌ పెట్టవచ్చని ఆయా మున్సిపాలిటీల ప్రజలు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement