
సులభంగా.. వేగంగా..
● భూ భారతి చట్టంతో సమస్యలకు పరిష్కారం ● పైలట్ ప్రాజెక్ట్‌గా సుజాతనగర్ మండలం ఎంపిక ● రెవెన్యూ సదస్సుల్లో 2,835 దరఖాస్తులు..
సుజాతనగర్: భూ భారతి చట్టం అమలుకు జిల్లాలో సుజాతనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయగా, రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభించింది. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు సులభతరం చేయడంతోపాటు తహసీల్దార్, ఆర్డీఓలకు అధికారాలు కల్పించడంతో సమస్యలు వేగవంతంగా పరిష్కారం కానున్నాయి. సుజాతనగర్ మండలంలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా సదస్సులో భూ సమస్యలపై 2,835 దరఖాస్తులు అధికారులకు అందాయి. సాదాబైనామా, అసైన్డ్ భూములు, పాసు పుస్తకాల జారీ, పోడు భూములు, గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయడం వంటి సమస్యలపై పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలను ఆన్‌లైన్‌చేసి, విచారణ త్వరితగతిన పూర్తిచేసి పరిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
సాదాబైనామా అర్జీలే ఎక్కువ..
మొత్తం 2,835 దరఖాస్తుల్లో సాదాబైనామా 1,240, వారసత్వం 118, ఫామ్ కే 103, పెండింగ్ మ్యుటేషన్ 3, పాసు పుస్తకాలపై 314, డీఎస్ పెండింగ్ 12 దరఖాస్తులతోపాటు, పోడు భూములు, అసైన్డ్ ల్యాండ్ అన్యాక్రాంతం, ఇతరత్రా కోర్టు కేసులకు సంబందించిన దరఖాస్తులు కూడా వచ్చాయి. వీటిలో ప్రస్తుతం వారసత్వం భూములు, గిరిజనులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కు సిద్ధంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. డిప్యూటీ తహసీల్దార్, గిర్దావర్, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లతో మూడు బృందాలుగా అధికారులు ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి భౌగోళిక హద్దులను ఏర్పాటు చేయనున్నారు.
రైతులకు ప్రయోజనం
ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రతీ సమస్య సీసీఎల్‌ఏ వరకు వెళ్లే పరిస్థితి ఉండేది. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదు. దీంతో రైతులు చేసేదేమి లేక ఇబ్బందులకు గురయ్యారు. ధరణి స్థానంలో వచ్చిన భూ భారతి చట్టంతో సులభంగా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉండటంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా త్వరలోనే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
సుజాతనగర్ మండల స్వరూపం
విస్తీర్ణం 24,927.18 ఎకరాలు
అటవీ భూమి 7,535.25 ఎకరాలు
అసైన్డ్ ల్యాండ్ 558.13 ఎకరాలు
ప్రభుత్వ భూమి 2,241.28 ఎకరాలు
రెవెన్యూ గ్రామాలు 6
గ్రామ పంచాయతీలు 20
పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేశా..
మా తాత కాకటి పుల్లయ్య ద్వా రా మా నాన్న వెంకయ్యకు వా రసత్వంగా 444 సర్వే నంబర్‌లో 2 ఎకరాల భూమి వచ్చింది. ఈ భూమిని గత 50 ఏళ్లుగా మా నాన్నే సాగు చేస్తున్నాడు. పాసు పుస్తకం లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు పొందలేకపోతున్నాం. ఇటీవల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాస్ బుక్ కోసం దరఖాస్తు చేశాను. –కాకటి సునీల్ కుమార్, సింగభూపాలెం
సమస్యలకు పరిష్కారం
మండలంలో మొత్తం 2,835 దరఖాస్తులు రాగా, మూడు బృందాలుగా దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. వారసత్వం, గిరిజనులు కొనుగోలు చేసి రిజి స్ట్రేషన్‌కు సిద్ధంగా ఉన్న భూ సమస్యలకు ప్రస్తుతం పరిష్కారం లభించనుంది. ప్రభుత్వ అనుమతి అనంతరం సాదాబైనామా దరఖాస్తులను విచారిస్తాం.
–వనం కృష్ణప్రసాద్, తహసీల్దార్, సుజాతనగర్

సులభంగా.. వేగంగా..

సులభంగా.. వేగంగా..