
ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: విద్యార్థులు విద్యతో పాటు ఇతర రంగాల్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాణించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని కేజీబీవీలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి పీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించటం ద్వారా ఉన్నత విద్య సులభతరం అవుతందన్నారు. క్యాంపుల ద్వారా నేర్చుకున్న అంశాలను నిత్య జీవన శైలిలో అమలు పర్చాలని సూచించారు, కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరచారి, ఎంఈఓ రమ,కొత్తగూడెం జీసీడీఓఅన్నామణి,విద్యార్థినులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెంలో..
దుమ్ముగూడెం: గిరిజన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొని అంతర్జాతీయస్థాయిలో రాణించడానికి అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా ప్రాంగణాలు అవసరమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మంగళవారం మండలంలోని ములకపాడు, ములకనపల్లిలో నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణం, కమ్యూనిటీ హాల్, ఇండోర్ స్టేడియాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలీస్ శిక్షణ తీసుకునే విద్యార్థులకు 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ నిర్మించాలన్నారు. రూ.10 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ త్వరితిగతిన పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్, టీఏ శ్రీనివాస్, ఏఈ రవి తదితరులు పాల్గొన్నారు.