
‘నకిలీ’లతో జాగ్రత్త!
● విత్తన కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి ● ఆఫర్లు, మాయమాటలను నమ్మి మోసపోవద్దు ● రశీదులు, ఖాళీ ప్యాకెట్లు భద్రపరుచుకోవాలి ● జూన్ నుంచి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం
రైతు సంఘాల నాయకులు
ఏం కోరుతున్నారంటే..
● నకిలీ విత్తనాల ఉత్పత్తి, నియంత్రణకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలి.
● మార్కెట్‌లో నాణ్యమైన విత్తనాలు మాత్ర మే విక్రయించేలా చర్యలు తీసుకోవాలి.
● తనిఖీలు చేపట్టేందుకు రెగ్యులేటరీ సంస్థలు ఏర్పాటు చేయాలి. విత్తన కంపెనీలు, పంపిణీదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలి.
● నకిలీ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహనా సదస్సులు జరపాలి.
● గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలో విత్తన విక్రయాలకు అనుమతి పొందిన కంపెనీలు, డీలర్ల వివరాలను, ఏయే కంపెనీ విత్తనాలు ఎంత ధర అనే విషయాలను రైతులందరికీ తెలిసేలా గ్రామాల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి.
బూర్గంపాడు/పాల్వంచరూరల్/చర్ల: జూన్ నుంచి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభంకానుడటంతో రైతులు వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కాలంటే రైతులు ఆది నుంచే అప్రమత్తంగా ఉండాలి. దుక్కులు దున్నడం దగ్గర నుంచి పంట దిగుబడి చేతికి వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు పాటించాలి. విత్తన ఎంపికలో అప్రమత్తంగా లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయనున్నారు.
ఊరు, పేరులేని విత్తనాలను అంటగడతారు..
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో నాణ్యత లేని, ఊరుపేరు లేని వరి, పత్తి, మిర్చి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. అధిక దిగుబడి ఇస్తుందంటూ, కొత్తరకం అంటూ మాయమాటలతో మభ్యపెడుతున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించి ఏటా రైతులను మోసం చేస్తున్నారు. తక్కువ ధరలు, ఆఫర్లు అంటు కొందరు డీలర్లు నాణ్యతలేని విత్తనాలను విక్రయిస్తున్నారు. గతంలో పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోయారు. గతేడాది కోడిపుంజుల వాగు గ్రామ రైతులకు పాల్వంచలోని విత్తన వ్యాపారి నకిలీ వరి విత్తనాలు విక్రయించాడు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చేయగా సంబంధిత కంపెనీ నష్టపరిహారం చెల్లించింది. చండ్రుగొండ, సుజాతనగర్ మండలాల్లో కూడా నాణ్యత లోపం కలిగిన వరి విత్తనాలు విక్రయించారు. పాండురంగాపురంలో నకిలీ మిర్చి, పత్తి విత్తనాలు కొనుగోలుచేసి పలువురు రైతులు దగాపడ్డారు. సూరారం, జగన్నాథపురం, కోడిపుంజుల వాగులో నాణ్యతలేని వరి విత్తనాలను కొనుగోలుచేసి మోస పోయారు.
బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో
నకిలీ విత్తనాలు..
నిషేధిత గ్లైసిల్, బీటీ, బీటీ–3తో పాటుగా అనుమతులులేని కొన్ని కంపెనీల పత్తి విత్తనాలు గతంలో జిల్లాలో విక్రయించారు. గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి, జిన్నింగ్ మిల్లుల నుంచి నకిలీ విత్తనాలు తెప్పించి, బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో నింపి విక్రయించారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన గడువు ముగిసిన విత్తనాలు కూడా కొత్తగా ప్యాకింగ్ చేసి విక్రయించిన ఘటనలు ఉన్నాయి. గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన పలువురు వ్యాపారులు జైలు పాలయ్యారు.
విత్తనం కొనే ముందు...
రైతులు వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్ చేసిన బస్తాలను ధ్రువీకరణ(ట్యాగ్) ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. విత్తన బస్తాపై ప్యాకెట్లపై గడువు తేది, రకం పేరు, లాట్ నంబర్లు చూసుకోవాలి. కొనుగోలు బిల్లుతోపాటు విత్తన రకం, గడువు తేదీ ఉండేలా డీలర్ సంతకంతో కూడిన రశీదు మాత్రమే తీసుకోవాలి. కొనుగోలు చేసిన రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి.
అవగాహన కల్పిస్తున్నాం
విత్తన కొనుగోళ్లపై ప్రతి మంగళవారం రైతువేదికల్లో అవగాహన కల్పిస్తున్నాం. రశీదులు, ప్యాకెట్లను భద్రపరుచుకోవాలి. అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనాలి. గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు బుక్ చేసేవారికి దూరంగా ఉండాలి. 450 గ్రాముల బ్రాండెడ్ విత్తన ప్యాకెట్ ధర రూ. 901గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుమించి ఎక్కువ ధర చెల్లించవద్దు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.
– బాబూరావు, వ్యవసాయశాఖ జిల్లా అధికారి

‘నకిలీ’లతో జాగ్రత్త!