
వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి మంగళవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు.
రాంబంటుకు
పట్టువస్త్రాలు..
కొండగట్టు అంజన్నకు కానుకలు
సమర్పించిన భద్రగిరి ఈఓ
భద్రాచలం: కొండగట్టు అంజన్న స్వామికి భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అధికారులు మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భద్రగిరి రామయ్య తరఫున పట్టువస్త్రాలను, కానుకలను సమర్పించటం కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఈ నెల 22న హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, వైదిక సిబ్బంది కొండగట్టు చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
ఆర్టీసీకి కార్మికులే మూలస్తంభం
రీజినల్ మేనేజర్ సరిరామ్
మణుగూరు టౌన్: టీజీఎస్ ఆర్టీసీ సంస్థకు కార్మికులే మూలస్తంభమని, అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు కీలకపాత్ర పోషిస్తున్నారని ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ అన్నారు. మంగళవారం మణుగూరు డిపోలో రీజినల్‌స్థాయి ప్రగతి చక్ర అవార్డులను ప్రదానం చేశారు. డ్రైవర్ కేటగిరీలో 10 మందికి, కండక్టర్ కేటగిరీలో ఏడుగురు, టీ డ్రైవర్ కేటగిరీలో ముగ్గురు, మెకానికల్ కేటగిరీలో ముగ్గురు, పీహెచ్‌బీ డ్రైవర్ కేటగిరీలో ఐదుగురికి, ఉత్తమ బస్టాండ్‌గా ఖమ్మం కొత్త బస్టాండ్‌కు, మొత్తం 29 ప్రగతి చక్ర అవార్డులను అందజేసి మాట్లాడారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, పర్సనల్ ఆఫీసర్ రామకృష్ణ, అకౌంట్ ఆఫీసర్ బాలస్వామి, డిపోల డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
స్కూల్ బస్సులు
ఫిట్‌గా ఉండాలి
జిల్లా రవాణా అధికారి వెంకటరమణ
కొత్తగూడెంఅర్బన్: త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులు ఫిట్‌నెస్‌తో ఉండాలని జిల్లా రవాణాశాఖ అధికారి సూచించారు. జిల్లా రవాణా కార్యాలయంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకు బస్సుల ఫిట్‌నెస్, రహదారి భద్రతపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి డ్రైవర్ వాహనం నడిపే ముందు ఫిట్‌నెస్ చెక్ చేసుకోవాలని, ప్రతీ వాహనానికి అటెండెంట్ ఉండాలని చెప్పారు. స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు బాధ్యతగా ఉండాలని కోరారు. అనంతరం పాటించాల్సిన జాగ్రత్తల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ బస్సుల డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా రామయ్య కల్యాణం

వైభవంగా రామయ్య కల్యాణం