
వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
● బూర్గంపాడు సీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ ● పనితీరు మారకపోతే బదిలీ చేస్తామని హెచ్చరిక
బూర్గంపాడు : ‘ఆస్పత్రిలో వైద్యసేవలు అందించేందుకు సూపరింటెండెంట్, వైద్యులు, స్టాఫ్ నర్స్‌లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు. అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుంటే బూర్గంపాడులో గుండు సున్న. ఇదే లాస్ట్ వార్నింగ్. మార్పురాకపోతే దూర ప్రాంతాలకు బదిలీ చేస్తాం. ప్రజలు కలెక్టరేట్‌కు రాకుంటే, నేనే ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటా. డెలివరీ కేసుల సంఖ్య పెంచేలా మీరు ఎందుకు గ్రామాలకు వెళ్లడంలేదు. బూర్గంపాడు సీహెచ్‌సీ మ్యూజియంలా మారింది. ప్రజలు రావడంలేదని చెబుతున్నారు. మరి ఆస్పత్రిని మూసేద్దామా’ అంటూ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు 20 ప్రసవాలు చేయాలని లక్ష్యం నిర్దేశించారు. మంగళవారం ఆయన బూర్గంపాడు సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఆస్పత్రిలో ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే అందరినీ బదిలీ చేస్తామని హెచ్చరించారు. అనంతరం బూర్గంపాడులోని తెలంగాణ గురుకుల పాఠశాల(బాలికలు)ను కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రహరీల నిర్మాణం, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజల ఆదరణ పొందాలి
మణుగూరు టౌన్: ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించి, ప్రజల ఆదరణ పొందాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం ఆస్పత్రిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, బాధితులను చులకన భావంతో చూడొద్దని చెప్పారు. అనంతరం మున్సిపాలిటీలోని రాజుపేట, విఠల్‌రావునగర్ ఏరియాల్లో పర్యటించారు. సింగరేణి హద్దులను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బొగ్గు, ఇసుక లారీలతో దుమ్ము, ధూళి వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తంగా చేయగా, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మించుకోలేని పరిస్థితి ఉందని, ఈ రెండు గ్రామాలను సింగరేణి మణుగూరు ఓసీ విస్తరణలో తీసుకుని మరోచోట పునరావాసం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య, డీసీహెచ్‌ఎస్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీల్, వైద్యుడు గౌరీ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.

వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం