
వృద్ధురాలి ఆత్మహత్య
అశ్వాపురం: మండల కేంద్రానికి చెందిన సారంగి సరోజిని (60) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ.. మతిస్థిమితం కోల్పోయింది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు అశ్వాపురం పీహెచ్‌సీకి తరలించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిది వేధింపులతో వదిన..
పాల్వంచ: మరిది వేధింపులు తాళలేక వదిన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. సుజాతనగర్ మండల కేంద్రానికి చెందిన బత్తుల వీరయ్యకు త్రివేణి(32)తో గతంలో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా త్రివేణి మరిది అయిన టీఎస్‌పీఎస్ కానిస్టేబుల్ బత్తుల నాగరాజు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె పర్సనల్ ఫొటోలను బంధువులు, తెలిసిన వారికి ఫోన్‌లో పంపిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజుల కిందట పాల్వంచ వికలాంగుల కాలనీలో ఉంటున్న తండ్రి శివ ఇంటికి వచ్చింది. సోమవారం పైపోర్షన్‌కు వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
విద్యుదాఘాతంతో మూడు పశువులు మృతి
చండ్రుగొండ: మండలంలోని సత్యనారాయణపురం శివారు రైల్వేలైన్ సమీపంలో విద్యుదాఘాతానికి గురై మూడు పశువులు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగుచూసింది. బాధిత రైతుల కథనం ప్రకారం.. గానుగపాడు వాసి వెంకన్నకు చెందిన రెండు పాడిగేదెలు, సత్యనారాయణపురంవాసి భాగ్యరాజుకు చెందిన దుక్కిటెద్దు ఆదివారం మేతకు వెళ్లాయి. రైల్వేలైన్ సమీపంలో త్రీఫేస్ విద్యుత్ వైరు కిందపడి ఉండటంతో విద్యుదాఘాతానికి గురై మూడు పశువులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఒక్కో పశువు విలువ రూ.లక్ష ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. కాగా, గాలిదుమారం, పిడుగుపాటుకు గానుగపాడు, సత్యనారాయణపురం మధ్య విద్యుత్‌లైన్ ఇన్సులేటర్లు ఫెయిల్ అయి తీగలు కిద్దపడ్డాయని, ఒక్కో పశువుకు శాఖ తరఫున రూ.40 వేలు పరిహారం అందిస్తామని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.