
సీతారాంపురంలో విషాదం
అశ్వాపురం: మండలంలోని సీతారాంపురం గ్రామంలో విషాదం నెలకొన్నది. గ్రామానికి చెందిన కొందరు బంధువులు మేడారం సమ్మక్క – సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు ఈ నెల 17న ఒక ట్రాక్టర్, ఒక ఆటోలో మేడారం వెళ్లారు. ఈ నెల 18న తిరుగుపయనమయ్యారు. తాడ్వాయి వద్ద మంచినీరు తాగేందుకు ట్రాక్టర్ రహదారి వెంబడి ఆపారు. ఈ క్రమంలో వెనుక వచ్చిన ఇసుక లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో నూప దుర్గ (38), చెట్టిపల్లి సీతమ్మ (40) మృతి చెందారు. ట్రాక్టర్‌లోని మిగతావారంతా గాయపడగా వారిని ములుగు, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు తరలించారు. కాగా, గాయపడిన వారిలో చెట్టిపల్లి ముత్తమ్మ, చెట్టిపల్లి సునీత, మోడియం సమ్మయ్య, మోడియం రాకేశ్, మణుగూరు మండలం కూనవరానికి చెందిన వెల్లుబోయిన శంకర్, ఏపీ రాష్ట్రం కుక్కునూరు మండలం కమ్మరిగూడెంనకు చెందిన గొల్ల జంపన్న ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీతారాంపురం గ్రామానికి చెందిన కోండ్రు శ్రీను, నూప నరసింహ, చెట్టిపల్లి శ్రీకృష్ణ, ఈసం జీవన్, మొడియం వినయ్, సుజాత ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు చెట్టిపల్లి సింధు, చెట్టిపల్లి విష్ణు, కారం వంశీ, సౌందర్యను డిశ్చార్జ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, గాయాలపాలైన వారంతా నిరుపేదలే. క్షతగాత్రుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంబులెన్స్‌కు చెల్లించేందుకు సైతం డబ్బు లేకపోవడంతో పలువురు సామాజిక మాధ్యమాల్లో విరాళాలు సేకరించి అందజేశారు. కాగా, ప్రమాదంపై మంత్రి సీతక్క, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మేడారం వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి