
రామా... వసతి కష్టాలు కనుమా..
భద్రాచలంలో గుట్టపై శిథిలమైన సత్రాలు, కాటేజీలు
● పునఃనిర్మాణం చేస్తేనే కష్టాల నుంచి ఉపశమనం ● వసతి ఇక్కట్లు తీర్చాలని భక్తుల విన్నపాలు
రంగనాయకుల గుట్టపై శిథిలావస్థలో ఉన్న టీటీడీ సత్రం (ఇన్‌సెట్) పూర్తిగా శిథిలమైన అన్నవరం సత్రం
దక్షిణ అయోధ్యగా భావించే భద్రాచలానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు వసతి కష్టాలు తీరడం లేదు. ప్రధాన ఉత్సవాల సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. ఆ సమయంలో కాస్త హడావుడి చేసే అధికారులు ఆతర్వాత పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో శాశ్వత పరిష్కారం లభించడం లేదు. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యాన ఇప్పటినుంచే వసతి గదుల నిర్మాణానికి ప్రణాళికాయుతంగా ముందుకు సాగితే ఇక్కట్లు తీరనున్నాయి.
– భద్రాచలం
టీటీటీ, అన్నవరం సత్రాలు..
గతంలో భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఏళ్ల తరబడి టీటీడీ, అన్నవరం ఆలయ పరిధిలోని సత్రాలు ఆసరాగా నిలిచాయి. అయితే, అవన్నీ 1950, 1960 నాటి కట్టడాలు కావడంతో పూర్తిగా శిథిలమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా సీఆర్‌ఓ కార్యాలయం వెనుక మారుతి సదనం పేరుతో వసతి గదుల నిర్మాణం చేపట్టి దేవస్థానానికి అప్పగించింది. కానీ పైన ఉన్న టీటీడీ సత్రం, అన్నవరం సత్రం మాత్రం మరమ్మతులకు నోచుకోలేదు. వీటి స్థానంలో బహుళ అంతస్తులతో కూడిన భవనాలు నిర్మిస్తే ఉత్సవాల సమయంతో పాటు వారాంతాలు, సెలవు దినాల్లో భక్తులకు తక్కువ ఖర్చుతో వసతి సమకూరుతుంది.
గోదావరి పుష్కరాలే లక్ష్యంగా...
గోదావరి పుష్కరాలకు తెలంగాణ భక్తులు అత్యధికంగా భద్రాచలానికే వస్తారు. 2015లో గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. 2027లో సైతం ఇంతకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యాన భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యాన ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. అభయాంజనేయస్వామి ఆలయం వద్ద, సూపర్ బజార్ సెంటర్, అంబసత్రం వైపు ఉన్న దేవస్థానం భూముల్లో వసతి గదుల నిర్మాణానికి అవకాశముంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లోని పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లోనూ షిర్డీ, తిరుపతి మాదిరి నిర్మాణాలు చేపడితే మేలు జరుగుతుంది. ఆ దిశగా దేవస్థానం అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నాయి కానీ లేనట్టే...
దశాబ్దాల క్రితం భద్రాచలం రంగనాయకుల గుట్టపైన వసతి గదులతో కూడిన సత్రాలు ఉండేవి. వీఐపీల కోసం ఒకటి, రెండు సత్రాలు ఉండగా.. కాలక్రమంలో ఆలయం చుట్టుపక్కల ప్రైవేట్ లాడ్జీలతో పాటు దేవస్థానం వసతి గదులను సైతం నిర్మాణమయ్యాయి. దీంతో రంగనాయకుల గుట్టపై వీవీఐపీల కోసం కాటేజీలను నిర్మించారు. గుట్టపై 28కు పైగా కాటేజీలు ఉండగా, పర్యవేక్షణ లేకపోవడంతో అవి వాడకంలో లేకుండా పోయాయి. ప్రస్తుతం పది కాటేజీలు ఉపయోగంలో ఉండగా వీటిలో సగానికి పైగా ప్రైవేట్ యాజమాన్య పరిధిలోనే ఉన్నాయి. మరో రెండింటిని దాతల సాయంతో నిర్మిస్తున్నారు. అయితే, వినియోగంలో లేని కాటేజీలకు మరమ్మతులు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో శిథిలమైన వాటి స్థానంలో బహుళ అంతస్తుల వసతి గదుల నిర్మాణానికి అవకాశమున్నా ఆ దిశగా ఎవరూ దృష్టి సారించడం లేదు.
గదుల నిర్మాణానికి ప్రణాళిక
దేవస్థానానికి చెందిన ఖాళీ భూముల్లో వసతి గదుల నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నాం. పట్టణంలోని స్థలాల్లోనే కాక పురుషోత్తపట్నంలోని ఆలయ భూముల్లోనూ పుష్కరాల దృష్ట్యా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. వీటిని ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అంతేకాక గుట్టపై కాటేజీలను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.
– ఎల్.రమాదేవి, ఈఓ, రామాలయం

రామా... వసతి కష్టాలు కనుమా..

రామా... వసతి కష్టాలు కనుమా..