
నిరీక్షణకు ఇక తెర..
● నేర పరిశోధనలో కీలకంగా ఫోరెన్సిక్.. ● వేగవంతమవుతున్న పోస్ట్‌మార్టం ● 15 నెలల్లో 1,218 శవ పరీక్షలు ● అందులో 20 శాతం అనాథ శవాలే
సకాలంలో నివేదికలు అందజేస్తున్నాం
శవ పరీక్షలు ఏరోజుకారోజు నిర్వహిస్తున్నాం. రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేస్తున్నాం. పోలీసు కేసుల విచారణకు అవసరమైన రిపోర్టులు సకాలంలో అందజేస్తున్నాం. మార్చురీ వద్దే కార్యాలయం ఏర్పాటు చేసి నిత్యం అందుబాటులో ఉంటున్నాం. సాధ్యమైనంత వరకు ఇక్కడే శవ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అత్యవసరమైన వాటికి హైదరాబాద్‌కు శాంపిళ్లు పంపిస్తున్నాం. భవిష్యత్‌లో అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తాం.
– రాథోడ్ వినాయక్, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొంతకాలంగా శవ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి. ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చాక పోస్టుమార్టం నిర్వహణ, రిపోర్టులు వేగవంతంగా రావడం పోలీసుల నేరపరిశోధనకు ఉపయుక్తంగా మారాయి. సంబంధిత వ్యక్తి ఎలా, ఎప్పుడు మరణించాడనేది తేల్చేందుకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. పోలీసులు పంచనామా నిర్వహించి ఫోరెన్సిక్ వైద్యునికి రిక్వెస్ట్ లెటర్ పెట్టిన తర్వాత శవ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత వైద్యుడు ఇచ్చే రిపోర్ట్‌ను బట్టి పోలీసులు విచారణ చేపడతారు. గతంలో శవ పరీక్షకు చాలా ఇబ్బందులు ఉండేవి. పోలీసులు పంచనామా సిద్ధం చేసి మార్చురీకి వచ్చినా పోస్టుమార్టానికి వైద్యుడు రావడం ఆలస్యమయ్యేది. దీంతో పోలీసులు, మృతుల బంధువులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది.
అంతేకాక క్రిటికల్ కేసుల్లో మృతికి కారణాలను గుర్తిస్తూ రూపొందించే రిపోర్టులు ఆలస్యంగా వచ్చేవి. కొన్ని వరంగల్, మరికొన్ని హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్ధితి లేదు. కీలకమైన శవ పరీక్షలే హైదరాబాద్‌లో చేయిస్తున్నారు తప్ప మిగితావి ఖమ్మంలోనే నిర్వహిస్తున్నారు.
ఘోషిస్తున్న అనాథ శవాల ఆత్మలు
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీలో గత 15 నెలల్లో 1,218 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. 2024లో 995, ఈ మూడు నెలల కాలంలో 223 శవపరీక్షలు జరిగాయి. జిల్లాలో హత్యలు, ఆత్మహత్యలు, రైలు, రోడ్డు ప్రమాదాలు, అనుమానిత మరణాలకు సంబంధించిన బాడీలకు ఇక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తారు. అలా వచ్చే మృతదేహాల్లో 20 శాతానికి పైగా అనాథ శవాలే ఉంటున్నాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడి నుంచో వచ్చి జిల్లాలో మృతి చెందే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యాచకులు, పనుల కోసం వచ్చే వారు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందేవారు, ట్రైన్ నుంచి పడి మృతి చెందే వారు ఎక్కువగా ఉంటున్నారు. వారిని గుర్తు పట్టడం కష్టం అవుతుండగా కొద్ది రోజులు వేచి చూసి పోలీసులు, ఆస్పత్రి అధికారుల నిర్ణయంతో అనాథ శవాలుగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ శవాల దహనానికి జిల్లాలో ప్రభుత్వ పరంగా ఎలాంటి వ్యవస్థ లేదు. దీంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
శవ పరీక్ష కీలకం..
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లిన తర్వాత ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు దీనిపై సబ్జెక్ట్ ఉంటుంది. ఫోరెన్సిక్ విభాగంలో ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్లను నియమించారు. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో ఇబ్బందులు తొలగిపోయాయి. బాధిత కుటంబాలకు సకాలంలో సేవలు అందుతుండగా, పోలీసులకు సైతం రిపోస్టులు సమయానికి వస్తున్నాయి. కాగా నేరపరిశోధనలో పోస్టుమార్టం రిపోర్టు కీలకం. మృతికి దారి తీసిన ఘటనలను నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా హత్య, ఆత్మహత్య, హత్యాచారం, ప్రమాదం, అనుమానాస్పద మరణాలు సంభవించినప్పుడు క్రిమినల్ కేసుల పరిష్కారానికి శవ పరీక్షలు కీలకంగా నిలుస్తాయి. గతంలో పోస్ట్‌మార్టం ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగగా ఫోరెన్సిక్ వైద్యుడి రాకతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. మార్చురీ వద్ద ఫోరెన్సిక్ విభాగం ఏర్పాటుతో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటుండగా నిరీక్షణకు తెరపడింది.

నిరీక్షణకు ఇక తెర..