
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో ఆదివారం జరిగిన ప్రపంచ ప్రదర్శనశాల దినోత్సవం, కోయ వీరగాథ చక్రం ప్రదర్శన డాక్యుమెంటేషన్ ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ గూడేలలో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలను మొక్కవోని ధైర్యంతో ఎదిరించిన సమ్మక్క సారలమ్మలు, కాకతీయులను ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసుల ఇలవేల్పులు బాపనమ్మ చంద్రపాల వారసులు, రుద్రమదేవి పరిపాలన కాలంలో వాడిన ఆయుధాలు, వారి చరిత్రను వీరగాథలుగా మలిచి నేటితరం గిరిజనులకు తెలియపరచడం అభినందనీయమన్నారు. ఆదివాసీ కళలు, ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా, ఖండాంతరాలకు తెలిసే విధంగా గిరిజన మ్యూజియంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మ్యూజియం సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. అనంతరం కోయ సంస్కృతీ సంప్రదాయాలకు చెందిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించి, కులపతులను పీఓ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమల్ రావు, బండ్ల మునీశ్వరరావు, గొర్రె బాపనయ్య, బండ్ల చుక్కమ్మ, గొర్రె సత్యం, రాంబాబు, వీరాస్వామి, గిరిజనులు పాల్గొన్నారు.