
నిబంధనలు బేఖాతర్!
● భద్రాచలంలో అక్రమంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ● నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నారు. వంద, రెండొందల గజాల్లో రెండు, మూడు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు. నోటీసులు ఇచ్చేందుకు కూడా జాప్యం చేస్తున్నారు. మొదటి అంతస్తు నిర్మాణంలో ఉన్నప్పుడు ఫిర్యాదు అందితే మూడు అంతస్తు నిర్మించేటప్పుడు స్పందిస్తున్నారు. పాఠశాల, షాపింగ్ కాంప్లెక్సుల భవనాలు కూడా అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు.
జీ+2 వరకే అనుమతి..
భద్రాచలంలోని 19 వార్డుల్లో 36 వేల కుటుంబాలు ఉన్నాయి. 80 వేల మంది జనాభా నివసిస్తున్నారు. దక్షిణ భారత అయోధ్యగా పేరొందిన ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో క్రమంగా ఇళ్ల నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల 36 ఇళ్ల నిర్మాణానికి గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారు అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ నిబంధనల మేరకు పట్టణంలో 300 చ.మీలోపు జీ+2 అంతస్తుల వరకే ఇళ్ల నిర్మాణాలకే అనుమతి ఉంది. కానీ పలువురు జీ+3, జీ+4, జీ+5 వరకు నిర్మిస్తున్నారు.అధికారులు యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో యజమానులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరుకు వీధుల్లోనూకనీసం దారి లేకుండా నిర్మిస్తున్నారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో అక్రమనిర్మాణాలు అంతస్తులు దాటిపోతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.