
పత్తి కాంటాల్లో మోసం
సుజాతనగర్: పత్తి కాంటాల్లో మోసానికి పాల్పడుతున్న చిరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుజాతనగర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌కే అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. సుజాతనగర్ మండలంలోని సర్వారం, జూలూరుపాడు మండలంలోని కొమ్ముగూడెం, చుంచుపల్లికి చెందిన పలువురు చిరు వ్యాపారులు తమ ట్రాలీ వాహనాల్లో గ్రామాల్లో తిరుగుతూ పత్తి కొనుగోలు చేస్తున్నారు. వీరు జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన పత్తి వ్యాపారులు కేశపూర్ణ వెంకట కృష్ణారావు, సుజాతనగర్ మండలం కోమటపల్లి గ్రామానికి చెందిన మూడు భీమ్లాలకు విక్రయిస్తున్నారు. అయితే మార్కెట్‌లో గుమస్తాగా పనిచేసే భూక్యా అర్జున్, ధర్మ కాంటా వే బ్రిడ్జి ఆపరేటర్లు గోతం సతీష్, అక్కినపల్లి రాజేష్‌లతో చిరువ్యాపారులు చేతులు కలిపి తెచ్చిన పత్తి కంటే అదనంగా వే బిల్లులు చూపిస్తూ వ్యాపారుల నుంచి నగదు తీసుకుంటున్నారు. మూడు, నాలుగు నెలలుగా ఈ దందా సాగుతోంది. క్రమంగా నష్టం వస్తుండటంతో గమనించిన వ్యాపారులు వెంకట కృష్ణారావు, భీమ్లాలు ఈ నెల 8న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టగా 268.95 క్వింటాళ్ల పత్తిని అదనంగా చూపించి చిరువ్యాపారులు, ఆపరేటర్లు సుమారు రూ. 17 లక్షలను కాజేసినట్లు తేలింది. ఈ ఘటనలో 26 మంది చిరువ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 18 ట్రాలీ వాహనాలు సీజ్ చేయడంతో పాటు రూ.13.18 లక్షలను రికవరీ చేశారు. కాగా వే బ్రిడ్జి ఆపరేటర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఎం.రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
26 మంది చిరు వ్యాపారులు అరెస్ట్